Maha Shivratri 2023 : భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు
Maha Shivratri 2023 : మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
Maha Shivratri 2023 : మహా శివరాత్రిని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలు, నియమ నిష్టలతో జరుపుకుంటారు. భక్తులు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేపట్టి.. సాయంత్రం వేళ శివయ్యను దర్శించుకుంటారు. శివాలయాలకు వెళ్లి.. పరమేశ్వరుడిని దర్శించుకుని ఉపవాస దీక్షలను విరమిస్తారు. ఈ నేపథ్యంలో... మహాశివరాత్రి రోజు శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోతాయి. ఇక ఈ సారి శివరాత్రి పర్వదినం వారాంతంలో (ఫిబ్రవరి 18న - శనివారం) వస్తుండటంతో.... చాలా మంది ప్రముఖ శైవక్షేత్రాలకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇలాంటి భక్తుల కోసం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. మహాశివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు బస్సు సర్వీసులు నడపనున్నామని తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పనుంది. శ్రీశైలం, ఏడుపాయల, వేములవాడ, కీసరగుట్ట, కొమురవెల్లి, వేలాల తదితర శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది.
శివరాత్రికి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలి అని అనుకుంటున్న వారి కోసం ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. శ్రీశైలానికి 578 ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొంది. ఏడుపాయలకు 497 ప్రత్యేక బస్సులు... వేములవాడకు 481 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కీసరగుట్టకు 239... వేలాలకు 108... కాళేశ్వరానికి 71.. కొమురవెల్లికి 52..రామప్ప ఆలయానికి 15 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్ పాయింట్లతో పాటు నగరంలోని పలు ఇతర ప్రారతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు నడపనున్నారు. ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
శ్రీశైలానికి టికెట్ రేట్లు...
ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలానికి సూపర్ లగ్జరీలో ఒకరికి రూ.600, డీలక్స్‌లో రూ.540, ఎక్స్‌ప్రెస్ లో రూ.460 తీసుకుంటారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీలో ఒకరికి రూ.650, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ప్రెస్‌లో రూ.500 వసూలు చేస్తారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ నడుస్తోంది. పలు ఫోన్ నెంబర్లను(99592 26250, 9959226248, 9959226257, 9959226246, 040-27802203, 9959226250, 9959226149) అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని వివరాల కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించవచ్చు.