TSRTC : మహిళా ప్రయాణికులకు శుభవార్త... ఈ రూట్ లో TSRTC స్పెషల్ బస్సు
TSRTC Latest News : మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. కోఠి - కొండాపూర్ రూట్ లో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
TSRTC Latest News: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే చాలా ఆఫర్లను ప్రకటించగా… తాజాగా మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దీకాపుల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటుందని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఈ సేవలను మహిళా ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.
గమ్యం యాప్…
TSRTC Gamyam : సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ నకు ‘గమ్యం’ అని పేరుపెట్టారు. ఇటీవలనే ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
"ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం ఉంది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నాం. గమ్యం యాప్ ద్వారా స్టార్టింగ్ నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్ లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.” అని సజ్జనార్ తెలిపారు.
మహిళా ప్రయాణికుల భద్రతకు టీఎస్ఆర్టీసీ పెద్దపీట వేస్తుందని సజ్జనార్ తెలిపారు. మహిళల సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్(SoS) బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉందన్నారు. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేశామని సజ్జనార్ చెప్పారు. ఈ యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చన్నారు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్ట్ చేయొచ్చన్నారు. 'TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని, టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎండీ సజ్జనారా తెలిపారు.