TSRTC: రూ. 116 చెల్లించండి.. మీ ఇంటి వద్దకే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు-tsrtc to delivery muthyala talambralu of bhadrachalam temple check full details here
Telugu News  /  Telangana  /  Tsrtc To Delivery Muthyala Talambralu Of Bhadrachalam Temple Check Full Details Here
భక్తులకు తెలంగాణ ఆర్టీసీ  గుడ్ న్యూస్
భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ (twitter)

TSRTC: రూ. 116 చెల్లించండి.. మీ ఇంటి వద్దకే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

15 March 2023, 18:56 ISTHT Telugu Desk
15 March 2023, 18:56 IST

TSRTC Special Offers Latest: శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. భద్రాచలం రాములోని తలంబ్రాలను భక్తులకు అందజేయాలని నిర్ణయించింది.

TSRTC To Delivery Muthyala Talambralu of Bhadrachalam Temple: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించగా... తాజాగా శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.

శ్రీ రామనవమి వేడుకలు భద్రాచలం రాములోరి సన్నిధిలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సిద్ధమైంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానర్‌ ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్‌ హెడ్‌ (లాజిస్టిక్స్‌) పి.సంతోష్‌ కుమార్‌ రూ.116 చెల్లించి రశీదును స్వీకరించారు. తొలి బుకింగ్‌ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ఇక గతేడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేసింది తెలంగాణ ఆర్టీసీ. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. ఈ ఏడాది కూడా భారీగా ఆదాయాన్ని పొందేందుకు సిద్ధమైంది.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా మరో రెండు స్పెషల్ ఆఫర్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం టి-6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటి ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి-6 టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్‌ను బస్సుల్లో కండక్టర్‌లు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టి-6 టికెట్లను మంజూరు చేయరు. 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టి-6 టికెట్‌ వర్తిస్తుంది. టికెట్‌ తీసుకునే సమయంలో వయసు ద్రువీకరణ కోసం వారు ఆధార్‌ కార్డు చూపించాల్సి ఉంటుంది.

వారంతాలు, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్‌ తీసుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే బస్సుల్లో టి-24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్‌ ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది.

టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత కథనం