TSRTC Super Luxury Bus to Davanagere: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు పక్క రాష్ట్రాలకు కూడా సరికొత్త సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా... శుక్రవారం కర్ణాటకలోని దావణగెరెకు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించింది.,హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం ఈ కొత్త సర్వీస్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతారు. ఈ కొత్త సర్వీస్ కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ , ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సిందనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. మియాపూర్ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్ నుంచి రూ. 840 చార్జీగా సంస్థ నిర్ణయించింది. టికెట్ బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.,,ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ... ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కర్నాటకలోని బెంగళూరు, రాయచూర్, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు. తాజాగా దావణగెరెకు సర్వీస్ ను ప్రారంభించామని చెప్పారు.,తాజాగా శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీ రామనవమి వేడుకలు భద్రాచలం రాములోరి సన్నిధిలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సిద్ధమైంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.,