TSRTC Weekend Tour Offer : 12 గంటల్లో హైదరాబాద్ చూసేయాలనుకుంటున్నారా?
TSRTC Weekend Tour Package : ఒక్క రోజులో హైదరాబాద్ చూడాలని ఉందా? ఉదయం నుంచి సాయంత్రం వరకూ చూడొచ్చు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలకు తిరిగిరావొచ్చు.
భాగ్యనగరంలో తిరగాలంటే.. ఒకటి రెండు రోజులు ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాల్సిందే. ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లాలంటే మరో రోజు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఆర్టీసీ సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. వీకెండ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. పార్కులు, రాజభవనాలు, మ్యూజియం, హుస్సేన్ సాగర్ లాంటి ప్రదేశాలను చూపిస్తారు. ప్రయాణికుల కోసం చాలా ఆఫర్లను ప్రకటించింది ఆర్టీసీ. 12 గంటల్లో తిప్పి చూపిస్తారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్ దర్శన్, వీకెండ్ టూర్ ప్యాకేజీ బస్సులను ప్రారంభించింది. ఇది నగరంలోని ఏడు వేర్వేరు ప్రదేశాలకు తీసుకువెళుతుంది. సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ దగ్గర ఉదయం 8:00 గంటలకు ప్రారంభమయ్యే బస్సు.. బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్‌కు పర్యాటకులను తీసుకువెళుతుంది. తారామతి బారాదరి రిసార్ట్‌లోని హరిత హోటల్‌లో లంచ్ ఉంటుంది.
గోల్కొండ కోట, దుర్గం చెరువు పార్కును సందర్శించిన తర్వాత కేబుల్ వంతెన మీదుగా ఎన్టీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ వైపు వెళుతుంది. 12 గంటల రైడ్ తర్వాత ఆల్ఫా హోటల్ దగ్గర టూరిస్టులను డ్రాప్ చేస్తారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ. 250, పిల్లలకు రూ. 130, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుకు రూ. 450, రూ. 340గా నిర్ణయించారు.
ఈ సేవలు ప్రారంభం అయ్యాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. www.tsrtconline.in లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 040 23450033 లేదా 040 69440000 సంప్రదించండి.
సంబంధిత కథనం