TSRTC Independence Day Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ రాయితీలు-tsrtc independence day offer 50 percent off on t24 ticket senior citizens ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Tsrtc Independence Day Offer 50 Percent Off On T24 Ticket Senior Citizens

TSRTC Independence Day Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ రాయితీలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2023 09:52 PM IST

TSRTC Independence Day Offer : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. టి-24 టికెట్ పై 50 శాతం రాయితీ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు పల్లె వెలుగు బస్సుల్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ
టీఎస్ఆర్టీసీ

TSRTC Independence Day Offer : పంద్రాగస్టు సందర్భంగా టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్ ను కేవలం రూ.75కే ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పిల్లలకు టి-24 టికెట్ ను రూ.50కే అందజేయనుంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రమే ఈ ప్రత్యేక రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

టి-24 టికెట్ పై 50 శాతం రాయితీ

ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్ ను ప్రయాణికులందరికీ రూ.75కే ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పిల్లలకు మాత్రం రూ.50కే ఇస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లకు ఒక్క రోజు టికెట్ లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది.

ఆగస్టు 15న రాయితీలు

"ఆగస్టు 15 దేశం మొత్తానికి పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ శుభ దినాన ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటీజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. వారు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్ కి తమ ఆధార్ కార్డును చూపించాలి. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం నాడు హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ రోజున పర్యాటక ప్రాంతాలు, పార్కులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టి-24 టికెట్ పై భారీ రాయితీని సంస్థ ప్రకటించింది. ఆ టికెట్ ను పెద్దలకు రూ.75కి, పిల్లలకు రూ.50కి అందజేస్తోంది. ఈ నెల 15న ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయి. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.

WhatsApp channel