TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన-tsrtc has announced that jeevan reddy mall has been taken over ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
May 16, 2024 07:58 PM IST

TSRTC On Jeevan Reddy Mall : జీవన్ రెడ్డి మాల్ వ్యవహారంపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం
జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం

TSRTC Jeevan Reddy Mall : హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద 01.06.2013న లీజ్‌కు తీసుకుందని ఆర్టీసీ పేర్కొంది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్‌ఓవర్‌ చేసుకుని.. షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారని వివరించింది.

అద్దె చెల్లించలేదు….

ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. “గత ఏడాది అక్టోబర్‌ వరకు రూ.8.65 కోట్ల బకాయి సంస్థకు పడింది. నోటీసులు జారీ చేయడంతో.. అక్టోబర్‌ లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్‌ లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టింది. షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్‌ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు” అని సజ్జనార్ తెలిపారు.

“ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి” అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.

బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసిందని సజ్జనార్ గుర్తు చేశారు హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి.. భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుందన్నారు.

టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని సజ్జనార్ స్పష్టం చేశారు. అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదన్నారు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోందని తెలిపారు.

కొంతకాలంగా వివాదం…

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టాండ్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను 33 సంవత్సరాలకు బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద జూన్ 1, 2013న ఆ భూమిని ఆర్టీసీ లీజ్‌కు ఇచ్చింది.

 ఆ స్థలంలో ఒక షాపింగ్‌ మాల్‌ను సదరు కంపెనీ డెవలప్‌ చేసింది. కాగా 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి స్వాధీనం చేసుకొని ఆ షాపింగ్ మాల్ కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. 

థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను జీవన్ రెడ్డి లీజ్‌కు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో ఆర్టీసీ సంస్థకు అద్దె చెల్లించలేదు. 2015 అక్టోబర్‌ వరకు రూ.4.30 కోట్ల బకాయిను సంస్థకు పడింది. దీంతో అప్పుడే టెర్మినేషన్‌ ఆర్డర్‌ను సంస్థ జారీ చేసింది. దీంతో రెండు పర్యాయాలు రూ.69 లక్షలను చెల్లించిన జీవన్ రెడ్డి.......... మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించినా స్పందించలేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. 

గత ఏడాది అక్టోబర్‌ వరకు రూ.8.65 కోట్ల బకాయిలు ఉన్నాయని, అప్పుడు మళ్లీ నోటీసులు జారీ చేయడంతో... గతేడాది అక్టోబర్ నెలలో రూ.1.5 కోట్లను మాత్రమే చెల్లించారని ఆర్టీసీ వివరించింది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం