TSRTC T-9 Tickets : టీఎస్ఆర్టీసీ టి-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత, రాఖీ పౌర్ణమి రద్దీయే కారణం!
TSRTC T-9 Tickets : రాఖీ పౌర్ణమి రద్దీ కారణంగా టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో జారీచేసే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసింది.
TSRTC T-9 Tickets : టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు్ల్లో ప్రయాణికుల కోసం అమలుచేస్తున్న టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రేపటి(ఆగస్టు 29) నుంచి నాలుగు రోజుల పాటు(సెప్టెంబర్ 1) టి-9 టికెట్లను నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లను తిరిగి యథాతథంగా జారీచేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టి-9 పేరుతో రెండు టికెట్లను టీఎస్ఆర్టీసీ జారీ చేస్తోంది. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టి-9-60, 30 కిలో మీటర్లు టి-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-9-60 టికెట్ ను రూ.100కు, టి-9-30ని రూ.50కి ప్రయాణికులకు అందజేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
రాఖీ పౌర్ణమి రద్దీ కారణంగా
రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆ సమయంలో టి-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టంగా ఉంటుందని, టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను నాలుగు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు టి-9 టికెట్లను జారీచేయమన్నారు. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా టి-9 టికెట్లు జారీ చేస్తామని వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
3 వేల స్పెషల్ బస్సులు
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, ఇతర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎండీ సజ్జనార్ ఆదేశించారు.