TSRTC Gamyam : టీఎస్ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్ కు 'గమ్యం' యాప్, మహిళా భద్రతకు ప్రత్యేక ఫీచర్-tsrtc bus tracking app gamyam launched md sajjanar in hyderabad ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Tsrtc Bus Tracking App Gamyam Launched Md Sajjanar In Hyderabad

TSRTC Gamyam : టీఎస్ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్ కు 'గమ్యం' యాప్, మహిళా భద్రతకు ప్రత్యేక ఫీచర్

Bandaru Satyaprasad HT Telugu
Aug 12, 2023 05:22 PM IST

TSRTC Gamyam : టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ కోసం 'గమ్యం' యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో గమ్యం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ లాంచింగ్
టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ లాంచింగ్

TSRTC Gamyam : సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ నకు ‘గమ్యం’ అని పేరుపెట్టారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను శనివారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. గమ్యం యాప్ సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తుందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తనకుందన్నారు. రెండేళ్లుగా ప్రజలకు ప్రజారవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్ఆర్టీసీ మార్కెట్ లోని పోటీని దీటుగా ఎదుర్కోనేందుకు అత్యాధునిక హంగులతో కూడిన 776 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గమ్యం యాప్ ప్రయోజనాలను వివరిస్తూ అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని సజ్జనార్ తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

4170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం

"ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం ఉంది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నాం. గమ్యం యాప్ ద్వారా స్టార్టింగ్ నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్ లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.” -టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఏ బస్’ ఫీచర్

మహిళా ప్రయాణికుల భద్రతకు టీఎస్ఆర్టీసీ పెద్దపీట వేస్తుందని సజ్జనార్ తెలిపారు. మహిళల సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్(SoS) బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉందన్నారు. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేశామని సజ్జనార్ చెప్పారు. ఈ యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చన్నారు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్ట్ చేయొచ్చన్నారు. 'TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని, టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎండీ సజ్జనారా తెలిపారు.

WhatsApp channel