TSRTC Free WiFi : ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై!
TSRTC Free WiFi : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కొన్ని బస్సులో అందుబాటులో ఉన్న సేవలను త్వరలో మరిన్ని బస్సులకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
TSRTC Free WiFi : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తీసుకొచ్చినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం ట్వీట్ చేశారు. అయితే ఈ సదుపాయం కొన్ని బస్సుల్లోనే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తొలి విడతగా కొత్తగా ప్రవేశపెట్టిన 16 ఏసీ స్లీపర్ బస్సులలో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులోకి తెస్తారని సమాచారం. ఈ ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో నడుస్తాయని తెలుస్తోంది. ఇటీవల ఈ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ అందుబాటులో ఉంచారు. వీటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 12 మీటర్ల పొడవున ఉండే ఏసీ స్లీపర్ బస్సుల్లో 15 లోయర్ బెర్త్‌లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్‌లు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు పాటు ప్రతీ బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా సదుపాయం కూడా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
వినూత్న ఆఫర్లు
ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తుంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించింది. లక్షల విలువైన బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దీంతో పాటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు వినూత్న ఆఫర్లు తీసుకొస్తుంది. స్లీపర్ బస్సులు, బస్ టికెట్లలో ఆఫర్లు, పల్లెవెలుగు బస్సుల్లో టి9 టికెట్లు ఇలా వినూత్న ఆలోచనలతో ఆర్టీసీ లాభాల బాటపట్టించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అదే విధంగా బస్సులు ఎక్కడో ఉన్నాయో తెలుసుకునేందుకు ట్రాకింగ్ అందుబాటులోకి తెచ్చింది. టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బస్సులను ట్రాక్ చేయవచ్చు.
హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో పలు ప్రాంతాలకు ఎలక్ట్రికల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ ఆర్టీసీ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపాలని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్- పంజాగుట్ట- జూబ్లీహిల్స్ చెక్ పోస్టు-ఫిల్మ్ నగర్-ఉస్మానియా కాలనీల మీదుగా మణికొండ వరకు ఈ సర్వీసులు నడపనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం వరకు మరో సర్వీస్ నడపాలని నిర్ణయించారు. మియాపూర్ డిపో పరిధిలో బాచుపల్లి-జేఎన్‌టీయూ-కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి-వేవ్ రాక్-ప్రగతి నగర్-జేఎన్‌టీయూ, వీబీఐటీ వరకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.