TSRTC Record : టీఎస్ఆర్టీసీ ఆల్‌టైమ్‌ రికార్డు.. ఒక్కరోజులోనే రూ. 22 కోట్లకుపైగా ఆదాయం-tsrtc all time record collection on rakhi pournami ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Tsrtc All Time Record Collection On Rakhi Pournami

TSRTC Record : టీఎస్ఆర్టీసీ ఆల్‌టైమ్‌ రికార్డు.. ఒక్కరోజులోనే రూ. 22 కోట్లకుపైగా ఆదాయం

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 01, 2023 03:28 PM IST

TSRTC Latest News: రాఖీ పూర్ణిమ పండగ వేళ తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది.ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు అని ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

సరికొత్త రికార్డు
సరికొత్త రికార్డు

TSRTC Record : రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి.

ట్రెండింగ్ వార్తలు

20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్…

ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈ సారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది.

రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్ కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు గమనార్హం.

“ప్రజా రవాణా వ్యవస్థ వెంటే తాము ఉన్నామని ప్రజలు మరోసారి నిరూపించారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి రాఖీ పౌర్ణమికి కూడా సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక్క రోజులో దాదాపు 41 లక్షల మంది ప్రయాణికులు సంస్థ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంస్థ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఈ సారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదు. గత ఏడాది రాఖీ నాడు 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా.. ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ లిపారు.

రాఖీ పండుగ నాడు ఎంతో నిబద్దతతో సిబ్బంది పనిచేశారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని చెప్పారు. ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను మొచ్చకుంటూ తమకు, ఉన్నతాధికారులకు సందేశాలు పంపించారని పేర్కొన్నారు.

“ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే.. సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అందుకు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది త్యాగం ఎనలేనిది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పని చేసి భవిష్యత్ లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నమ్మకాన్ని కొల్పోకుండా మంచి ఫలితాలు వచ్చేలా పాటుపడాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనర్ పిలుపునిచ్చారు.

WhatsApp channel