TSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమికి టీఎస్ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులు, ఈ నెల 29 నుంచి మూడ్రోజుల పాటు-tsrtc 3000 special buses for rakhi pournami on august 29 to 31st ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Tsrtc 3000 Special Buses For Rakhi Pournami On August 29 To 31st

TSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమికి టీఎస్ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులు, ఈ నెల 29 నుంచి మూడ్రోజుల పాటు

Bandaru Satyaprasad HT Telugu
Aug 26, 2023 09:50 PM IST

TSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ
టీఎస్ఆర్టీసీ

TSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై శనివారం ఎండీ వీసీ సజ్జనార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, గోదావరిఖని, మంచిర్యాల, ఇతర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్ స్టేషన్ లతో పాటు ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

గత ఏడాది రూ.20 కోట్లు

గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని ఎండీ సజ్జనార్ గుర్తుచేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. అదే స్ఫూర్తితో ఈ రాఖీ పౌర్ణమికి కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సజ్జనార్ సూచించారు.

మూడు వేల ప్రత్యేక బస్సులు

"అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్‌ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ రీజియన్లు 90 శాతానికిపైగా అక్యూపెన్సీ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్‌ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది." -ఎండీ వీసీ సజ్జనార్‌

ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బంది పడొద్దు

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని తెలిపారు. పండుగ నాడు ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్‌, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

WhatsApp channel