TS Group 1 Exam : ప్రిలిమ్స్ రాసేవారికి అలర్ట్.. TSPSC కొత్త రూల్స్ ఇవే!
tspsc group 1 prelims exam 2022: ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ - 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నారు.
TSPSC Group 1 Exam 2022: గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధం చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అక్టోబర్ 16వ తేదీన నిర్వహించే ఈ పరీక్ష కోసం1,041 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆదివారం నుంచి అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షల్లో పలు మార్పులు చేసింది టీఎస్పీఎస్సీ. పేపర్ సిరీస్ లు కాకుండా ప్రత్యేక నెంబర్ తో కేటాయించనుంది. ఇక పరీక్ష నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలను కూడా స్పష్టంగా తెలిపింది. వాటిని చూస్తే.....
పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అభ్యర్థులు చేరుకోవాలి. ఆ తర్వాత అనంతరం అభ్యర్థుల్ని అనుమతించబోరు.
పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు చెప్పులతోనే రావాలి, బూట్లు ధరించకూడదు. గోరింటాకు, సిరా, టాటూస్ తదితరాలతో చేతులు, కాళ్లకు అలంకరణలు చేసుకుని రావద్దని టీఎస్పీఎస్సీ తెలిపింది.
తప్పుడు ఐడెంటిటీ ఫ్రూఫ్‌లతో హాజరైనా, ఒకరి పేరిట మరొకరు వచ్చినట్లు తెలిసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
ఓఎంఆర్ పత్రంలో వైట్నర్, చాక్‌పౌడర్, బ్లేడ్, రబ్బరు వాడితే ఆ పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి.. కరెక్షన్ చేయరు.
పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు.
అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ ఓఎంఆర్ కాపీలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది.
ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
పరీక్ష కేంద్రాలు, అడ్రస్‌పై తలెత్తే సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టరేట్లలో గ్రూప్-1 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు TSPSC తెలిపింది.
ఓఎంఆర్‌పై అభ్యర్థి, ఇన్విజిలేటర్ ఇద్దరూ సంతకాలు చేయాలని, ఏ ఒక్కరి సంతకాలు లేకున్నా మూల్యాంకనానికి జవాబు పత్రాల్ని పరిశీలించబోరు. ఇరువురి సంతకాలు ఉండేలా అభ్యర్థి చూసుకోవాలి.
ఎ, బి, సి, డి సిరీస్‌ల స్థానంలో ఆరంకెల ప్రశ్నపత్రం నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనుంది. అభ్యర్థులు ఆరంకెల సిరీస్‌తో కూడిన ప్రశ్నపత్రం కోడ్‌ను ఓఎంఆర్ షీట్‌లో నమోదు చేసి, ఆ మేరకు రౌండ్లను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో బబ్లింగ్ చేయాలని కమిషన్ తెలిపింది.
ప్రశ్నాపత్రం బుక్‌లెట్ సిరీస్ నంబరు ఓఎంఆర్‌లో రాసి, వృత్తాల్ని సరిగా బబ్లింగ్ చేయకున్నా, వృత్తాల్ని సరిగా నింపి బుక్‌లెట్ సిరీస్ నంబరు రాయకున్నా.. ఒక్క అంకెను తప్పించినా ఆ ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోరు.
పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు ముందుగా హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి.
హాల్‌టికెట్లను అభ్యర్థులు ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి.ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ప్రింట్ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి.
ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో 150 ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి. పొరపాట్లు ఉంటే మరొకటి అడిగి తీసుకోవాలి.
ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టిపరిస్థితుల్లో మార్కు చేయకూడదు. ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న స్థలంలో కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా, ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.
హాట్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి....
అభ్యర్థులు తొలుత https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Group 1 Preliminary Test Hall Tickets 2022 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
సంబంధిత వివరాలను ఎంట్రీ చేసి క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు.
తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు.
మొత్తం గ్రూప్ –1 పోస్టులు - వివరాలు
ఎంపీడీవో- 121
జిల్లా బీసీ అభివద్ధి అధికారి– 2
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్– 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్– 38
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)– 20
డీఎస్పీ– 91
జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్– 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్– 8
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్– 2
జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్– 6
మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ (2) - 35
డీపీవో- 5
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్- 48
డిప్యూటీ కలెక్టర్- 42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్- 26
జిల్లా రిజిస్ట్రార్- 5
జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్- 3
ఆర్టీవో- 4
జిల్లా గిరిజన సంక్షేమాధికారి- 2
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులను మెుదటిసారిగా భర్తీ చేస్తున్నందున అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు తదితర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2023 జనవరిలో లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.