TS DSC 2023 : 5,089 టీచర్ ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తులు, ప్రాసెస్ ఇదే-ts trt registration 2023 begins today for 5089 posts check details here ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ts Trt Registration 2023 Begins Today For 5089 Posts Check Details Here

TS DSC 2023 : 5,089 టీచర్ ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తులు, ప్రాసెస్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 20, 2023 09:42 AM IST

TS TRT Registration 2023 Updates: తెలంగాణ డీఎస్సీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. www.schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.

డీఎస్సీ నోటిఫికేషన్
డీఎస్సీ నోటిఫికేషన్

TS TRT Registration 2023: తెలంగాణ టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. 5,089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

రోస్టర్ విధానం….

ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్‌ ప్రకారం నియమించాలని నిర్ణయించింది తెలంగాణ విద్యాశాఖ. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికింది. రోస్టర్‌ను 1వ పాయింట్‌ నుంచి ప్రారంభించింది. ఫలితంగా కొత్త రిజర్వేషన్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్‌ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించిన విషయం తెలిసిందే. టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)లోని పోస్టులు మహిళలకు భారీ సంఖ్యలో దక్కనున్నాయి. వారికి 33 శాతం రిజర్వేషన్‌ ఉండటంతోపాటు తొలిసారిగా కొత్త జిల్లాల వారీగా రోస్టర్‌ పాయింట్లను రూపొందించారు. చాలాచోట్ల మహిళ రోస్టర్‌ మేరకే పోస్టులు ఉండడం తదితర కారణాలతో ఏకంగా 51 శాతానికిపైగా ఉద్యోగాలు వారికి కేటాయించారు.ఇవే కాకుండా ఇక ఓపెన్‌ జనరల్‌ కోటాలోనూ వారు పోటీ పడే అవకాశం ఉంది. 5,089 పోస్టులను భర్తీచేస్తుండగా… వీటిలో 2,638 పోస్టులు మహిళలకే కేటాయించారు. ఓపెన్‌ జనరల్‌ కోటాలో మరో 2,451పోస్టులను రిజర్వ్‌ చేశారు.

దరఖాస్తు ప్రాసెస్ ఇదే…

- తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్‌ని http://www.schooledu.telangana.gov.in/ISMS/ ను సందర్శించండి

-హోమ్‌పేజీలో TS DSC TRT రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

-TS TRT రిక్రూట్‌మెంట్ 2023 కోసం Fill Online Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

- పేమెంట్ చేసిన నెంబర్ తో పాటు ఆధార్ కార్డు, కేటగిరి, దరఖాస్తు చేయాల్సిన పోస్టు, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

-అప్లికేషన్ ను సబ్మిట్ చేసి, అనంతరం డౌన్‌లోడ్ చేయండి

-భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోండి

-పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు ప్రత్యేక కాలమ్ కూడా వెబ్ సైట్ లో ఉంది.

-తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

-అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.

పరీక్ష విధానం…

డీఎస్సీ రాత పరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కోటి అర మార్కు చొప్పున 160 ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. టెట్‌ వెయిటేజీ కింద 20 మార్కులు ఉంటాయి. ఇలా 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్‌ జాబితాను తయారు చేస్తారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది. తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపడతారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికతను అమలు చేస్తారు.

ఇక డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం కలిపి 5,089 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. ఎస్జీటీ ఉద్యోగాలను డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) పూర్తి చేసిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఫలితంగా బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్ర మే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులను డీఎడ్‌ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పునిచ్చింది అత్యున్నత ధర్మాసం. ఈ తీర్పు ఆధారంగానే ఎన్సీటీఈ చర్యలు చేపట్టగా… ఆయా రాష్ట్రాలు కూడా సుప్రీంతీర్పునకు లోబడి ఎస్టీటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

WhatsApp channel