TS TET Key 2023 : టెట్ ప్రాథమిక 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TS TET 2023 Updates: టెట్ ప్రాథమిక కీ వచ్చేసింది. బుధవారం ఈ కీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపాలని అధికారులు సూచించారు.
Telangana TET 2023: టెట్ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. బుధవారం పేపర్ 1, 2 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ లను విడుదల చేసింది. అభ్యర్థులకు ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే… పంపాలని సూచించింది. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 27వ తేదీన టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15వ తేదీన టెట్ పరీక్ష జరిగింది. ఇందులో టెట్ పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది(84.12 శాతం) హాజరయ్యారు. పేపర్-2కు 2,08,498మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 91.11 శాతం మంది పరీక్ష రాశారు.
కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- అభ్యర్థులు మొదటగా https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- టెట్ initial key పై క్లిక్ చేయాలి.
- పేపర్ 1, 2తో పేపర్ కీ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే మీ కో ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
- కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే Ojections Service పై క్లిక్ చేసి మీ అభ్యంతరాలను పంపవచ్చు.(హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, పేపర్ కోడ్, బుక్ లెట్ కోడ్ ను ఎంట్రీ చేయాలి).
TS TRT Registration 2023: మరోవైపు తెలంగాణ టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. 5,089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి.
ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని నిర్ణయించింది తెలంగాణ విద్యాశాఖ. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికింది. రోస్టర్‌ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించింది. ఫలితంగా కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించిన విషయం తెలిసిందే. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ)లోని పోస్టులు మహిళలకు భారీ సంఖ్యలో దక్కనున్నాయి. వారికి 33 శాతం రిజర్వేషన్ ఉండటంతోపాటు తొలిసారిగా కొత్త జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను రూపొందించారు. చాలాచోట్ల మహిళ రోస్టర్ మేరకే పోస్టులు ఉండడం తదితర కారణాలతో ఏకంగా 51 శాతానికిపైగా ఉద్యోగాలు వారికి కేటాయించారు.ఇవే కాకుండా ఇక ఓపెన్ జనరల్ కోటాలోనూ వారు పోటీ పడే అవకాశం ఉంది. 5,089 పోస్టులను భర్తీచేస్తుండగా… వీటిలో 2,638 పోస్టులు మహిళలకే కేటాయించారు. ఓపెన్ జనరల్ కోటాలో మరో 2,451పోస్టులను రిజర్వ్ చేశారు.
డీఎస్సీ రాత పరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కోటి అర మార్కు చొప్పున 160 ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. టెట్ వెయిటేజీ కింద 20 మార్కులు ఉంటాయి. ఇలా 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేస్తారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది. తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపడతారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికతను అమలు చేస్తారు.