Basara RGUKT IIIT : బాసర ఐఐఐటీ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - జూన్ 5 నుంచి దరఖాస్తులు
RGUKT IIIT Basara Admissions 2023: ప్రవేశాలపై కీలక ప్రకటన చేసింది బాసర ఆర్జీయూకేటీ(రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం). 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసింది.
RGUKT IIIT Basara News: బాసర ఆర్జీయూకేటీలో 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అడ్మిషన్ల షెడ్యూల్ ను విడుదల చేశారు వర్శిటీ అధికారులు.మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి జూన్ 1న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. వర్సిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉన్న సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు(తెలంగాణ) కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడుతారు. ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు అవుతారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఇతరులకు రూ.500గా నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్ ను కూడా కలుపుతారు. విద్యార్థుల స్కోర్ గ్రేడ్ సమానంగా ఉంటే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. జూన్ 26వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. జులై 1న తొలి విడత కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వివరాల కోసం https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
ఈ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లను కూడా పాత పద్ధతిలోనే చేపట్టనున్నారు. పదో తరగతి జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 2020 ఏడాదికి సంబంధించి 1.40 లక్షకుపైగా 10 జీపీఏ రావడంతో వారికి సీట్లు కేటాయించడం ఇబ్బందిగా మారిటం.. ఆ తర్వాత ఇక 2021లోనూ 2,10,647 మందికి10 జీపీఏ వచ్చాయి. ఫలితాల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావొద్దనే ఆలోచనతో పాలిసెట్ ర్యాంకుల ద్వారా అడ్మిషన్లు చేపట్టారు. కానీ ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందిగా మారిందనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టకుండా… గ్రేడ్స్ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వనున్నారు.