TS LAWCET 2024 Key: తెలంగాణ లాసెట్ - 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవలే పరీక్షలు పూర్తి కాగా…తాజాగా ప్రిలిమినరీ అన్సర్ కీ విడుదలైంది. అంతేకాకుండా పరీక్ష రాసిన అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని కోరారు. https://lawcet.tsche.ac.in/TSLAWCET/LAWCET_kEY_OBJ_TERMS.aspx లింక్ పై క్లిక్ చేసి అభ్యంతరాలను పంపొచ్చు. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది.
అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.
ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ జరిగింది. ఇక మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.