Medaram Jatara 2024 Updates : పది జోన్లుగా 'మేడారం' ప్రాంతం - సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే-ts govt focus on medaram jatara actions to divide into 10 zones and assign responsibilities ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara 2024 Updates : పది జోన్లుగా 'మేడారం' ప్రాంతం - సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే

Medaram Jatara 2024 Updates : పది జోన్లుగా 'మేడారం' ప్రాంతం - సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jan 10, 2024 01:14 PM IST

Sammakka-Saralamma Maha Jatara 2024 Updates:మేడారం జాతరపై సర్కారు ఫోకస్​ పెట్టింది. మొత్తం 10 జోన్లుగా విభజించి బాధ్యతలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది.

మేడారం జాతర (ఫైల్ ఫొటో)
మేడారం జాతర (ఫైల్ ఫొటో) (Facebook)

Medaram Sammakka Sarakka Maha Jatara 2024: దేశంలో అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై రాష్ట్ర సర్కారు ఫోకస్​ పెట్టింది. వచ్చే నెల 21 నుంచి జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పనుల నిమిత్తం రూ.75 కోట్లు రిలీజ్​ చేసింది. వాటితో చేపట్టిన పనులన్నీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వగా.. 40 రోజుల్లో పనులన్నీ కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతోనే పనులను విభజించి, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేసి పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్​ లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్​ రెడ్డి మేడారం జాతరపై ఉమ్మడి వరంగల్​ జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ఇతర మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరను సక్సెస్​ చేసేందుకు చేపట్టాల్సిన పనులపై దీశానిర్దేశం చేశారు.

yearly horoscope entry point

కోటిన్నరకుపైగా భక్తులు

రెండేళ్లకోసారి జరిగే మేడారం వనదేవతల జాతరకు తెలంగాణ, ఏపీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గతంతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ మంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఈ సంవత్సరం దాదాపు కోటిన్నర మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆరంభ దశలోనే పనులు

మేడారం మహాజాతర ఇంకో 40 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రభుత్వం 75 కోట్లు రిలీజ్ చేసినా ఇంతవరకు జాతరకు సంబంధించి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా మేడారం వెళ్లే దారిలో రోడ్లే ప్రధాన సమస్యగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తగా.. మేడారాన్నికి రాకపోకలు ఎక్కువగా జరిగే తాడ్వాయి, నార్లాపూర్​, కాటారం మార్గాలు గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటితో పాటు కాల్వపల్లి, చెల్పాక, కొత్తూరు, కన్నెపల్లి, కొంగలమడుగు, రెడ్డిగూడెం తదితర రూట్లు కూడా గుంతలుగా మారాయి. ఆయా పనులన్నింటికీ నిధులు మంజూరయ్యాయి. కానీ వాటి పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్​ అవుతున్నాయి. వాస్తవానికి ఆ పనులన్నీ ఆరు నెలల ముందే చేపడితే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .జాతర దగ్గర పడుతున్న టైంలో పనులు హడావుడిగా చేపడితే నాణ్యతలోపంతో ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. రోడ్లతో పాటు మహాజాతరలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ప్రతిసారి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తోంది. ఈసారి కూడా జాతరలో ఎనిమిది చోట్లా తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.5.2 కోట్లు కేటాయించారు. వాటి పనులు కూడా ఆది దశలోనే ఉండటం గమనార్హం. జంపన్నవాగు వద్ద ఇదివరకు నిర్మించిన మూడు చెక్​ డ్యాంలు వరదలకు కొట్టుకుపోగా.. ఈసారి ఇసుక బస్తాలతో క్రాస్​ బండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులు ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నాయి. జాతరలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. టెంపరరీ ఏర్పాట్లు కూడా నత్తనడకన సాగుతుండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనులన్నీ ఆలస్యం కాగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమైంది.

విభజించి పనుల అప్పగింత

మేడారంలో చాలావరకు పనులు పెండింగ్ లో ఉండగా.. వాటన్నింటినీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి టార్గెట్​ పెట్టారు. ఇందుకు పనులను విభజించి, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ పనులన్నింటినీ 10 జోన్లుగా విభజించే కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎవరెవరికీ ఏఏ పనులు అప్పగించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఒకట్రెండు రోజులు పనుల విభజన పూర్తయితే ఇన్​ఛార్జులను నియమించి, టార్గెట్ పెట్టిన తేదీలోగా పనులు పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతరలో తాగునీటి సమస్య తలెత్తకుండా మంత్రులు కొండా సురేఖతో పాటు సీతక్కకు సీఎం రేవంత్​ రెడ్డి పలు సూచనలు కూడా ఇచ్చారు.

తక్కువ సమయంలో సాధ్యమయ్యేనా..?

వాస్తవానికి ఈపాటికల్లా మేడారం జాతరలో ఏర్పాట్ల పనులు చివరి దశకు చేరుకోవాలి. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిపోవడం, ఆ తరువాత కొత్త ప్రభుత్వ కూర్పు, మేడారం పనుల టెండర్లు తదితర ప్రక్రియల వల్ల పనులు చాలావరకు ఆరంభ దశలోనే ఉన్నాయి. దీంతోనే గడువులోగా పనులు పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 21 నుంచే జాతర ప్రారంభం కానుండగా.. సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించిన మేరకు జనవరి 31లోగా పనులు పూర్తవుతాయో లేదో చూడాలి.

రిపోర్టింగ్ : (హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం