TS - Governer Vs Govt : రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు.. ఈ ఏడాది అక్కడేనా ?-ts govt asked governer to restrict the flag hoisting event of the republic day celebrations to raj bhavan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Govt Asked Governer To Restrict The Flag Hoisting Event Of The Republic Day Celebrations To Raj Bhavan

TS - Governer Vs Govt : రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు.. ఈ ఏడాది అక్కడేనా ?

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 09:19 PM IST

TS - Governer Vs Govt : గతేడాది తరహాలోనే ఈ సారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. రాజ్ భవన్ లోనే జరిగేలా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ స్పష్టత ఇచ్చిందని సమాచారం. మరోవైపు.. బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో... ప్రోటోకాల్ ని అడ్డుకొని, ప్రభుత్వం గవర్నర్ ని అవమానిస్తోందనే అభిప్రాయాలు రాజ్ భవన్ నుంచి వ్యక్తం అవుతున్నాయి.

రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు ?
రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు ? (facebook)

TS - Governer Vs Govt : రాష్ట్రంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ దూరం మరింతగా పెరుగుతోంది. 2021లో మొదలైన అభిప్రాయ బేధాలు.. ఒకరి సమావేశాలకు మరొకరు దూరంగా ఉండే వరకు వచ్చాయి. రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమాలకు సర్కార్ గైర్హాజరవుతోండగా... రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించిన గవర్నర్ కి అధికారుల నుంచి సహకారం లభించడం లేదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై.. పలుమార్లు గవర్నర్ తమిళిసై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయగా... బీఆర్ఎస్ నేతలూ అంతే ధీటుగా స్పందించారు. గవర్నర్ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు. ఈ క్రమంలో... గణతంత్ర వేడుకలు, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల అంశంలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏం జరగనుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

వాస్తవానికి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో.. గవర్నర్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేస్తారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఈ సంప్రదాయం 2021 వరకు యధాప్రకారం సాగింది. ఆ ఏడాది ఆగస్టులో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. గవర్నర్ తమిళిసై అడ్డుచెప్పారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగతూ వచ్చింది. ఈ క్రమంలోనే 2022లో పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు ప్రభుత్వం నో చెప్పింది. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా నిర్వహించడం లేదని పేర్కొంది. అయితే.. మిగతా ఏ రాష్ట్రాల్లో లేని నిబంధనలు, తెలంగాణలోనే పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఈ సారైనా పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఉంటాయా లేవా అన్న ఉత్కంఠకి తెరదించుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు జరపడం లేదని.. రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం సోమవారం గవర్నర్ కార్యాలయానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ వల్లే ఈ సారి కూడా వేడుకలు నిర్వహించడం లేదని తెలిపినట్లు సమాచారం. నిజానికి... గణతంత్ర దినోత్సవం రోజు ప్రసంగానికి సంబంధించి స్పీచ్ కోసం గవర్నర్ రెండు రోజుల ముందే ప్రభుత్వానికి లేఖ రాశారని... అయితే సర్కార్ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో... ఈ సారి కూడా గవర్నర్ తమిళిసై.. రాజ్ భవన్ లోనే జెండా ఎగురవేయనున్నారు. సొంతంగా ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ మొత్తం పరిణామాలపై గవర్నర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. రిపబ్లిక్ డే వేళ గవర్నర్ పబ్లిక్ స్పీచ్ ఇవ్వనివ్వకుండా సర్కార్ అడ్డుకుంటోందనే అభిప్రాయం రాజ్ భవన్ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. వారం రోజుల క్రితం లక్షల జనంతో ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారని.. అప్పుడు ఎందుకు కోవిడ్ నిబంధనలు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు... గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి ఉభయ సభల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సర్కార్.. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఇవి ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన వెలువడింది. ప్రోటోకాల్ నిరాకరించి గవర్నర్ ను అవమానించేందుకే ఇలా చేశారని.. రాజ్ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే... ఫిబ్రవరి 3న బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం... అంతకుముందే క్యాబినెట్ భేటీలో ఆర్థిక పద్దుని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్ బిల్లు.. గవర్నర్ వద్దకు వెళుతుంది. రాజ్ భవన్ ఆమోదం తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఇప్పటికే... గవర్నర్ వద్ద 7 బిల్లులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో..... బడ్జెట్ బిల్లు విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

IPL_Entry_Point