Telugu News  /  Telangana  /  Ts Governement Good News For Contract Employees On Regularization Of Jobs In Budget Session
తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు
తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు

Contract Jobs regularization : ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ

06 February 2023, 12:51 ISTHT Telugu Desk
06 February 2023, 12:51 IST

Contract Jobs regularization తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించనున్నట్లు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరించనున్నట్లు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

Contract Jobs regularization తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం బడ్జెట్‌ ప్రసంగంలో చేర్చింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ నుంచి క్రమబద్దీకరించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులకు కీలకమైన భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్న ఆర్ధిక మంత్రి దేశంలో అత్యధిక వేతనాలను తెలంగాణలో పొందుతున్నారని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంటే తెలంగణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్ వాడీ, ఆశా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వడం, ఏక కాలంలో అందరికి వర్తింప చేసినట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఆంక్షలు పెడుతూ, రావాల్సిన నిధులలో కోతలు పెడుతున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఎప్పుడు తక్కువ చేయలేదని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వామ్యుల్ని చేయనున్నట్లు ప్రకటించారు. హెల్త్ కేర్ ట్రస్ట్ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం య ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 371 డి ప్రకారం తెలంగాణ 33జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో స్థానికులకు 60 నుంచి 80శాతం మాత్రమే ఉద్యోగాలు లభించేవని, కొత్తగా అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకు 95శాతం ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

2014 జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలో 1,61,572 ఉద్యోగాలను భర్తీకి అనుమతించామని వాటిలో 1,41,735 ఉద్యోగాలకు ఎంపికలు పూర్తైనట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో మరో 80,039 పోస్టుల భర్తీకి అనుమతించినట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని చెప్పిన మంత్రి కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి వేతనాలు చెల్లించడానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లను కేటాయించినట్లు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరించే ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు.