TS Mega DSC: తెలంగాణలో మెగా డిఎస్సీకి విద్యాశాఖ కసరత్తు-ts education department is preparing to conduct mega dsc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Mega Dsc: తెలంగాణలో మెగా డిఎస్సీకి విద్యాశాఖ కసరత్తు

TS Mega DSC: తెలంగాణలో మెగా డిఎస్సీకి విద్యాశాఖ కసరత్తు

Sarath chandra.B HT Telugu
Jan 01, 2024 07:56 AM IST

TS Mega DSC: తెలంగాణలో మెగా డిఎస్సీ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. టీచర్లు లేరనే కారణంగా మూసేసిన బ‌డుల్లో కూడా నియామకాలు చేపట్టాలని సిఎం ఆదేశించడంతో భారీగా పోస్టులు పెరిగే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

విద్యాశాఖ సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి
విద్యాశాఖ సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి

TS Mega DSC: తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సీ నోటిఫికషన్‌ విడుదలకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఉ‌ద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందని గత వారం ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఖాళీలను గుర్తించడంతో పాటు మూసేసిన పాఠశాలలను కూడా తెరిపించాలని సిఎం ఆదేశించడంతో భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. డిఎస్సీ నిర్వహణలో ఎలాంటి సాంకేతిక సమస్యలు, కోర్టు వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు.

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 5089పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2575 ఉన్నాయి. 2023 ఆగష్టు వరకు ఉన్న ఖాళీగా ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో టెట్‌ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే నిబంధన ఉపాధ్యాయులకు అడ్డంకిగా మారింది. కోర్టు వివాదాలు తలెత్తడంతో పదోన్నతులు నిలిచిపోయాయి.

టెట్‌ అర్హత పరీక్షను మరోసారి నిర్వహిస్తే మరో 9వేల పోస్టులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. వీటిని కూడా డిఎస్సీలో చేర్చాల్సి ఉంటుంది. పదవీ విరమణ చేసే ఉపాధ్యాయులను కూడా కలిపితే దాదాపు 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుందని లెక్కిస్తున్నారు.

మరో వారంపదిరోజుల్లో డిఎస్సీ నిర్వహణపై స్పష్టత వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. టెట్‌ నిర్వహించి పదోన్నతుల ప్రక్రియ పూర్తైన తర్వాత డిఎస్సీ నిర్వహించాలా లేకుంటే ఖాళీలను అంచనా వేసి ఆ మేరకు ముందే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలా అనే దానిపై చర్చలు జరుపుతున్నారు.

గతంలో డిఎస్సీ నోటిఫికేషన్‌కు 1.72లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ ఫిబ్రవరి నెలాఖరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత పరీక్షల నిర్వహణకు తగినంత సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.రెండు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తారా లేదంటే ఎన్నికలు పూర్తైన తర్వాత డిఎస్సీ తేదీలను ఖరారు చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

ప్రతి పంచాయితీలో ప్రభుత్వ బడి…

తెలంగాణలోని ప్రతి పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్ లోని సచివాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనన్నారు.

ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలని ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని రేవంత్ రెడ్డి శనివారం ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.