TS DSC Exam Schedule : డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే..?
TS TRT Exam Schedule 2023:డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్, అర్హతలను ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. ఈ మేరకు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. నవంబర్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
TS DSC Exams 2023: తెలంగాణ టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. 5,089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. మరోవైపు డీఎస్సీ పరీక్షకు సంబంధించి తేదీలు వచ్చేశాయ్. ఈ పరీక్షలను నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్ :
ప్రతి రోజూ 2 విడతల్లో ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నవంబర్ 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులు, నవంబరు 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబరు 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు ప్రాసెస్ ఇదే…
- తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్‌ని http://www.schooledu.telangana.gov.in/ISMS/ ను సందర్శించండి
-హోమ్‌పేజీలో TS DSC TRT రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
-TS TRT రిక్రూట్‌మెంట్ 2023 కోసం Fill Online Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- పేమెంట్ చేసిన నెంబర్ తో పాటు ఆధార్ కార్డు, కేటగిరి, దరఖాస్తు చేయాల్సిన పోస్టు, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
-అప్లికేషన్ ను సబ్మిట్ చేసి, అనంతరం డౌన్‌లోడ్ చేయండి
-భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోండి
-పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు ప్రత్యేక కాలమ్ కూడా వెబ్ సైట్ లో ఉంది.
-తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
-అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.
పరీక్ష విధానం…
డీఎస్సీ రాత పరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కోటి అర మార్కు చొప్పున 160 ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. టెట్ వెయిటేజీ కింద 20 మార్కులు ఉంటాయి. ఇలా 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేస్తారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది. తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపడతారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికతను అమలు చేస్తారు.
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం కలిపి 5,089 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. ఎస్జీటీ ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తి చేసిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఫలితంగా బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్ర మే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పునిచ్చింది అత్యున్నత ధర్మాసం. ఈ తీర్పు ఆధారంగానే ఎన్సీటీఈ చర్యలు చేపట్టగా… ఆయా రాష్ట్రాలు కూడా సుప్రీంతీర్పునకు లోబడి ఎస్టీటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
సంబంధిత కథనం