CM KCR: నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నాం - కేంద్రంపై కేసీఆర్ ఫైర్-ts cm kcr fires on mdi govt over niti aayog meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Cm Kcr Fires On Mdi Govt Over Niti Aayog Meeting

CM KCR: నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నాం - కేంద్రంపై కేసీఆర్ ఫైర్

Mahendra Maheshwaram HT Telugu
Aug 06, 2022 04:55 PM IST

cm kcr boycott niti aayog meeting:ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆదివారం జరగబోయే నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహిరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (twitter)

cm kcr boycott niti aayog meeting:ప్లానింగ్ కమిషన్ తీసివేసి తీసుకొచ్చిన నీతి ఆయోగ్ తో ఏం సాధించారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు... ఆ సంస్థ ఎందుకని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ అనేది నిరర్థకంగా మారిందని దుయ్యబట్టారు. 8 ఏళ్ల కాలంలో నీతి ఆయోగ్ తో ఏం పురోగతి సాధించారని నిలదీశారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఏ హామీ నేరవేరలేదని విమర్శించారు. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశంపై చర్చ జరగటం లేదన్నారు. అసలు నీతి ఆయోగ్ అజెండా ఎవరు తయారు చేస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తోందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

'నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయలేదు. కనీసం రాష్ట్రాలు ఇచ్చే సిఫార్సులను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం నిబంధన పెడుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. దేశంలో భారీగా ద్రవ్యోల్భణం పెరిగిపోతుంది. ఇటీవల రాష్ట్రాల అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఫలితంగా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. రైతుల పెట్టుబడి డబుల్ అయింది తప్ప సంపాదన డబుల్ కాదు. ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలో ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు. నీతి ఆయోగ్ లో మేథోమథనం జరగడం లేదు... భజనబృందంగా మారింది. ఢిల్లీలో కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది' అని కేసీఆర్ అన్నారు.

15వ ఆర్థిక సంఘం తెలంగాణకు 6వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తే... ఆరు పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ మండిపడ్డారు. పైగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కూడా పెండింగ్ లో పెడుతున్నారని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించినప్పటికీ...వచ్చేదేమీ లేదన్నారు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నామంటే... ఏదో రాజకీయంగా కాదని కేవలం ఆవేదన, బాధను తెలిపేందుకు చేయాల్సి వచ్చిందన్నారు. ఆర్మీలో తీసుకువచ్చిన మార్పులపై కనీసం నీతి ఆయోగ్ లో చర్చ జరిగిందా..? అని నిలదీశారు.

రాబోయే రోజుల్లో దేశంలో ఏకసామ్య పార్టీనే ఉంటుందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతున్నారని... అంటే మిగతా పార్టీలను మింగేస్తారా అంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏమైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

'ఉచితాలు వద్దని చెబుతున్నారు. మరీ NPAలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారు. దీనిద్వారా పెద్ద స్కామ్ నడిపిస్తున్నారు. కమీషన్లు తీసుకొని ఎన్ పీఏలు ప్రకటిస్తున్నారు. బ్యాంకుల రుణాల ఎగువేతలు లక్షల కోట్లు దాటుతున్నాయి. ఇవీ ప్రగతికి సంకేతామా..? మేకిన్ ఇండియా అన్నారు... కానీ వస్తువులన్నీ ఎక్కడ తయారవుతున్నాయి..? ఇదేనా నీతి ఆయోగ్ మేథా సంపత్తి..? కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల నూనె రైతులు ఢిల్లీలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. కార్పొరేట్ దొంగలకు లక్షల కోట్లు కట్టబెడుతున్నారు. పేద ప్రజల పొట్ట కొడుతున్నారు. ఇదేం నీతి...? చాలా బాధతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. అక్కడ మాట్లాడే 4 నిమిషాల కోసం 4 గంటలు కూర్చోవాలి. కనీసం బహిష్కరిస్తేనైనా చర్చ జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను' అని కేసీఆర్ స్పష్టతనిచ్చారు.

కొత్తగా 10 లక్షల పెన్షన్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయన్న కేసీఆర్... త్వరలోనే కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పాత కార్డుల ప్లేస్ లో కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్