TRS In Munugode : మెుత్తం సీన్ రివర్స్.. టీఆర్ఎస్ ఇలా ఎందుకు చేస్తోంది?-trs new strategy in munugode bypoll compare to past by elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Trs New Strategy In Munugode Bypoll Compare To Past By Elections

TRS In Munugode : మెుత్తం సీన్ రివర్స్.. టీఆర్ఎస్ ఇలా ఎందుకు చేస్తోంది?

Anand Sai HT Telugu
Oct 13, 2022 02:47 PM IST

Munugode By Election : మునుగోడు ఎన్నికలపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం స్ట్రాటజీ మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. కిందటి ఉపఎన్నికలతో పోల్చితే భిన్నంగా వెళ్తున్నట్టు ఉంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Stock Photo)

నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) జరగనుంది. కీలకమైన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికపై టీఆర్‌ఎస్(TRS) నాయకత్వ వైఖరి గత ఉప ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పథకాలు, పథకాలు ప్రకటించలేదు. ఇది గతంలో 2019 అక్టోబర్‌లో హుజూర్‌నగర్, 2020 నవంబర్‌లో దుబ్బాక, 2021 ఏప్రిల్‌లో నాగార్జునసాగర్, 2021 అక్టోబర్‌లో హుజూరాబాద్(Huzurabad) ఉపఎన్నికల్లో అనుసరించిన విధానానికి పూర్తి విరుద్ధంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

గతంలో జరిగిన ఉపఎన్నికలన్నింటిలోనూ సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ ఈ నియోజకవర్గాల అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. ఒక్కో మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు, ప్రతి గ్రామ పంచాయతీకి లక్షల రూపాయలతో పాటు వివిధ కులాల వారికి రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేశారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక(Munugode By Election) విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ఆగస్టు 20న సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించినా నిధులు, పథకాలు ప్రకటించలేదు. తన ప్రసంగంలో కేవలం బీజేపీ(BJP)పై విరుచుకుపడ్డారు. త్వరలో నియోజకవర్గంలో మరో బహిరంగ సభలో ప్రసంగిస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్‌లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని మునుగోడు స్థానికుల నుంచి డిమాండ్‌ ఉంది. అయితే ఇది రెండు నెలలు గడిచినా కార్యరూపం దాల్చలేదు.

నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 30 లేదా 31 తేదీల్లో చండూరులో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సీఎం కొత్త పథకాలు, నిధులు ప్రకటించలేరు. మునుగోడుపై సీఎం ఎందుకు కాసులు కురిపించలేదనే దానిపై టీఆర్‌ఎస్(TRS) వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల నిధులు మంజూరు చేసి దళిత బంధు(Dalit Bandhu) పథకాన్ని ప్రారంభించింది. ఎంతగానో ప్రచారం చేసింది. కానీ తాను రాజీనామా చేసినందుకే.. నిధులు వచ్చాయని ఈటల రాజేందర్ చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. ఆ వ్యూహం బెడిసికొడుతుందనే భయంతోనే ఇలా చేశారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే గొర్రెల పంపిణీ పథకం కింద నిధులు మాత్రం.. నేరుగా వేస్తామని ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హుజూరాబాద్‌లో దళిత బంధుకే రూ.2 వేల కోట్లు, నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మరో రూ.600 కోట్లు మంజూరయ్యాయనే ప్రచారం ఉంది. మునుగోడు అభివృద్ధికి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopalreddy) క్రెడిట్‌ కొట్టేస్తారని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భయపడుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలు జరిగితే నిధులు, పథకాలు, ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నందున అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజ్‌గోపాల్ రెడ్డి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రెడిట్ మళ్లీ బీజేపీకి వెళ్తొందని టీఆర్ఎస్ అనుకుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

WhatsApp channel