ED questions TRS MLA: మరోసారి ఈడీ ముందుకు MLA మంచిరెడ్డి.. కేడర్‌లో టెన్షన్!
trs mla manchireddy kishan reddy: రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. మంగళవారం 8 గంటలకుపైగా విచారించిన ఈడీ... ఇవాళ కూడా పిలవడంతో... పార్టీ కేడర్ లో ఆందోళన మొదలైంది.
ED questions TRS MLA Manchireddy kishan Reddy: అధికార టీఆర్ఎస్ లో ఈడీ టెన్షన్ మొదలైంది. గతకొద్దిరోజులుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పలుమార్లు ప్రస్తావిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగానే... ఆ పార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ నోటీసులు రావటం, విచారణకు కూడా హాజరుకావటం చర్చనీయాంశంగా మారింది.
ఫెమా..? క్యాసినో...?
మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన విషయంలో ఈడీ కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి కొద్దిరోజుల కిందట నోటీసులు ఇచ్చింది. దీనికి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ... స్వయంగా విచారణకు రావాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన మంగళవారం విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే బుధవారం కూడా ఈడీ ముందుకు మరోసారి హాజరయ్యారు ఎమ్మెల్యే మంచిరెడ్డి. దీంతో ఆయన వర్గీయులు, పార్టీ కేడర్ తో పాటు జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అసలేం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు... ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వేల కోట్ల రూపాయలను కాజేశారని... ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న భూముల వ్యవహారాల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫార్మా సిటీ, తట్టిఖానా భూముల లావాదేవీల్లోనూ ఉన్నారని చెప్పారు. వీటన్నింటిపై ఈడీ దర్యాప్తు ఒక్కటే సరిపోదని… మిగతా సంస్థలతో కూడా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు క్యాసినో కేసు కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఇందులో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈడీ కూడా వారిపై దృష్టిపెట్టినట్లు చర్చ నడిచింది. ఈ కేసులోనూ మంచిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈడీ... ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ జరుపుతుందా లేక ఫెమా కేసులోనే విచారిస్తుందా అన్న డైలామా నడుస్తోంది.