TRS Meeting : టీఆర్ఎస్ సమావేశాలు…. బీజేపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ రెడీ-trs executive committee meeting on june 21 22 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Executive Committee Meeting On June 21, 22

TRS Meeting : టీఆర్ఎస్ సమావేశాలు…. బీజేపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ రెడీ

HT Telugu Desk HT Telugu
Jun 17, 2022 06:51 AM IST

బీజేపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రెడీ అవుతున్నారు. జులై మొదటి వారంలో హైదరబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ధీటుగా టిఆర్‌ఎస్‌ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ కీలక నేతలంతా మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనుండటంతో బీజేపి వైఫల్యాలను నిలదీసేందుకు ఇదే అనువైన సమయమని భావిస్తున్నారు. ఇందుకోసం జులై 21,22 తేదీల్లో టిఆఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు.

బీజేపీకి పోటీగా జూన్‌లో పార్టీ సమావేశాల నిర్వహణకు కేసీఆర్‌ రెడీ
బీజేపీకి పోటీగా జూన్‌లో పార్టీ సమావేశాల నిర్వహణకు కేసీఆర్‌ రెడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అనువుగా మార్చుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్‌, బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్‌ వస్తున్న సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తున్నారు. తెలంగాణ పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా, 18రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ వస్తున్న సమయంలో ఆ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే జూన్‌ 21,22 తేదీల్లో హైదరాబాద్‌లో టిఆర్ఎస్‌ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఇదే అనువైన సమయమని కేసీఆర్‌ భావిస్తున్నారు.

 ఇందుకోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి హైదరాబాద్‌లో రెండురోజుల పాటు కారవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కీలక నేతలు పాల్గొననున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో జరిగే సమావేశాల్లో టిఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇవ్వనున్నారు. ఈ సమావేశాల ద్వారా బీజేపీపై విరుచుకుపడాలని, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు.

విభజన హామీల అమలులో జాప్యం, కాజీపేట కోచింగ్‌ డిపో ఏర్పాటులో జాప్యం, రాష్ట్రంలో కేంద్ర విద్యా, వైద్య సంస్థలను ఏర్పాటు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అవమానిస్తుంటే బీజేపీ నేతలు దానికి వంత పడుతున్నారని టిఆర్ఎస్‌ ఆరోపిస్తోంది. 

తెలంగాణ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే సమయంలోనే ఆ పార్టీ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బీజేపీపై పల్లె నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసేలా కార్యాచరణను పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ వివరించబోతున్నారు. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు అవసరాన్ని కూడా నేతలకు వివరించబోతున్నారు.

IPL_Entry_Point

టాపిక్