BRS KTR: కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్ చేస్తారని ప్రచారం..పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు
BRS KTR: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరును ప్రస్తావించారు.
BRS KTR: ఫార్మా కంపెనీ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసు తెలంగాణలో రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. సీఎం సొంత నియోజక వర్గంలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. పట్నం రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరును ప్రస్తావించడంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పట్నంను ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి ఆదేశంతో జైలుకు తరలించారు. కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.
నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును పోలీసులు ప్రస్తావించారు. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. లగచర్లలో అధికారులపై దాడి చేసిన 46 మందిలో 19 మందికి అక్కడ భూములు లేవని ఐజీ స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో వారి భూములు లేవని స్పష్టం చేశారు.
కేటీఆర్ నివాసం వద్ద హైడ్రామా…
లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్తీక్‌రెడ్డి తదితర నేతలు బుధవారం బుధవారం అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా కేటీఆర్‌తో భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.
కుట్ర లేదన్న కేటీఆర్….
లగచర్ల ఘటనలో కుట్ర లేదని.. బలవంతంగా భూసేకరణ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. సురేశ్ అనే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త తన ఏడెకరాల భూమి పోతుండడంతో.. కడుపు మండి, అదే విషయాన్ని అడిగారు. భూమి కోల్పోతున్న రైతులు అడగడం తప్పా? సురేశ్ దాడికి పాల్పడినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తమ పార్టీ కార్యకర్త సురేశ్... పార్టీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో మాట్లాడడం తప్పేమిటన్నారు. ఫార్మా విలేజ్‌ల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్నం నరేందర్‌రెడ్డితో సహా రైతులందరినీ తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరే స్వయంగా దాడి జరగలేదని చెబుతుంటే.. ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారు. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యలమేనని, అరెస్టు చేసిన రైతులను ప్రభుత్వ వైద్యులతో కాకుండా న్యాయస్థానం సూచనల మేరకు ప్రైవేటు వైద్యులతో రైతులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి'' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.