Hyderabad Traffic : ట్రాఫిక్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విధుల్లో 'ట్రాన్స్‌జెండర్ల' సేవలు - కీలక ఆదేశాలు-transgender volunteers for traffic management and drunk driving checks in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic : ట్రాఫిక్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విధుల్లో 'ట్రాన్స్‌జెండర్ల' సేవలు - కీలక ఆదేశాలు

Hyderabad Traffic : ట్రాఫిక్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విధుల్లో 'ట్రాన్స్‌జెండర్ల' సేవలు - కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 15, 2024 09:41 AM IST

హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ ఇబ్బందుల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టిపెట్టాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు.

ట్రాఫిక్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల విధుల్లో 'ట్రాన్స్‌జెండర్ల' సేవలు
ట్రాఫిక్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల విధుల్లో 'ట్రాన్స్‌జెండర్ల' సేవలు

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించాలని సూచించారు.

సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల నియమించాలని చెప్పారు. నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌ సందర్భాల్లోనూ వారి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా తాగి వాహనాలు(డ్రంక్ అండ్ డ్రైవ్) నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు.

ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక గుర్తింపు నివ్వడంతో పాటు వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హోం గార్డ్ తరహాలో జీత భత్యాలు సమకూర్చేలా విధి విధానాలతో పాటు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

చర్యలు తప్పవు : సీఎం రేవంత్ రెడ్డి

గురుకుల హాస్టళ్లల్లో నాణ్యమైన ఆహారం సరఫరా చేయని వారిపై కఠినమైన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున జరుపుకునే బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం  విద్యార్థుల సమక్షంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించింది. ఇందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి…. అంగన్‌వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్, ప్రియదర్శిని పేరుతో ప్రత్యేక పాఠ్య పుస్తకాలను  విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘11 నెలల పాలనలో తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన రోజు. ఈరోజును మరిచిపోలేను’ అన్నారు. విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. 

“విద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందుకే బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు కేటాయించాం. గురుకులాల్లో పిల్లలకు సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని ఆదేశించాం. అందుకే సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం. నాణ్యమైన భోజనం అందించాలనే డైట్ చార్జీలను పెంచాం. అలాగే కాస్మోటిక్ చార్జీలను పెంచాం. గ్రీన్ చానెల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చాం. బడులు తెరిచిన రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాం. 20 వేల మంది టీచర్లకు పదోన్నతులు, ఎలాంటి వివాదాలకు తావులేకుండా 35 వేల మంది టీచర్ల బదిలీలు, డీఎస్సీ ద్వారా 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం” అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

 

Whats_app_banner