Trains Cancelled : గుంటూరు-కాచిగూడ రైలు పదిరోజులు రద్దు…
Trains Cancelled సాంకేతిక కారణాల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తుున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రెండో రైల్వే లైన్ అందుబాటులో లేకపోవడంతో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లను పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
Trains Cancelled రెండో రైల్వే లైన్ అందుబాటులో లేకపోవడంతో ట్రైన్ నంబర్ 17251/17252 గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పదిరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది.
బేతంచర్ల- రంగాపురం- మల్కాపురం స్టేషన్ల మధ్య రెండో లైనును అందుబాటులోకి తెచ్చే పనుల నేపథ్యంలో ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వివరించింది. గుంటూరు-కాచిగూడ రైలు ఈ నెల 9 నుంచి 19 వరకు, కాచిగూడ- గుంటూరు రైలు 9-20 వరకు రద్దయ్యాయి.
మరోవైపు గంగినేని-ఎర్రుపాలెం స్టేషన్ల మధ్య పనుల నేపథ్యంలో పలు రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, అదేవిధంగా మూడు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. డోర్నకల్-విజయవాడ, విజయవాడ-డోర్నకల్, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ రైళ్లను ఈనెల 9-18 మధ్య రద్దుచేసింది.
ఖమ్మం జిల్లా గంగినేని, ఎర్రుపాలెం స్టేషన్ల నాన్ ఇంటర్ లింకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 18519 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లిస్తున్నారు.మార్చి 8,9,11,13,15,16 తేదీలలో విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించనుంది. ఈ తేదీలలో రైలు కాజీపేట మీదుగా ప్రయాణించదు. దాని స్థానంలో విజయవాడ-గుంటూరు మార్గంలో వెళుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని అధికారులు కోరారు.
ట్రైన్ నంబర్ 22849 షాలిమార్-సికింద్రాబాద్ రైలు మార్చి 8,15 తేదీలలో విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించనుంది. రెండు రోజులు వరంగల్, కాజీపేట మార్గాల్లో రైళ్లు వెళ్లవు. ట్రైన్ నంబర్ 18112 యశ్వంత్ పూర్-టాటానగర్ రైలు మార్చి 12న సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ మార్గంలో ప్రయాణిస్తుంది. వరంగల్ , ఖమ్మం స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణం ఉండదు.ఈ రైళ్లలో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు కోరారు.