సెల్ఫీ దిగుతూ డ్యామ్‌లోకి జారిన పిల్లలు.. కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి-tragic incident father dies trying to save children who fell into dam while taking selfie ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సెల్ఫీ దిగుతూ డ్యామ్‌లోకి జారిన పిల్లలు.. కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

సెల్ఫీ దిగుతూ డ్యామ్‌లోకి జారిన పిల్లలు.. కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

HT Telugu Desk HT Telugu

కరీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో కలిసి లోయర్ మానేర్ డ్యామ్ వద్దకు వెళ్లిన ఓ తండ్రి, నీటిలో మునిగిపోతున్న పిల్లలను కాపాడబోయి ప్రాణాలు వదిలారు.

లోయర్ మానేరు డ్యామ్‌లో ప్రాణాలు కోల్పోయిన తండ్రి

విహార యాత్ర విషాదంగా మారింది. పిల్లల సెల్ఫీ ఫోటో తండ్రీ ప్రాణం తీసింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేసే బంగారి విజయ్ కుమార్ డ్యామ్ లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ లో ఫే అండ్ అకౌంట్ లో సూపరింటెండెంట్ గా విజయ్ కుమార్ పని చేస్తారు. కరీంనగర్ సంతోష్ నగర్ లో నివాసం ఉండే విజయ్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో భార్య ప్రశాంతి ఇద్దరు పిల్లలతో కలిసి హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో లోయర్ మానేర్ డ్యామ్ ను సందర్శించారు.

బీటెక్ చదివే కూతురు సాయినిత్య, పదో తరగతి చదివే కొడుకు విక్రాంత్ డ్యామ్ లో నీటి పక్కన సరదాగా సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కూతురు నీటిలోకి జారిపోయింది. దీంతో వెంటనే తండ్రి విజయ్.. బిడ్డను కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో విజయ్ నీట మునిగగా కొడుకు వారిని కాపాడేందుకు నీళ్ళలోకి దిగాడు.

పిల్లలను ఒడ్డుకు తరలించే క్రమంలో తండ్రి విజయ్ నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఒడ్డున ఉన్న భార్య కేకలు వేయడంతో స్థానికంగా చేపలు పడుతున్న జాలర్లు శంకర్ గమనించి ఇద్దరు పిల్లలను కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తండ్రి విజయ్ మాత్రం అప్పటికే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో పిల్లలతో పాటు భార్య రోదనలు మిన్నంటాయి.

సెలవు రోజున..శాశ్వత సెలవు

బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో ఆ సెలవే విజయ్ ఇంటా విషాదం మిగిల్చిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విజయ్ తో పాటు పిల్లలకు కూడా సెలవు కావడంతో సరదాగా డ్యామ్ వద్దకు వెళ్లి సందడి చేస్తున్న తరుణంలో సెల్ఫీ ఫోటో వారి పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఎండీ కాలనీ సమీపంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చేస్తున్న బిడ్డ, పదో తరగతి చదువుతున్న కొడుకు కోరిక మేరకు డ్యామ్ వద్దకు వెళ్లిన ఆ కుటుంబానికి సెల్ఫీ ఫోటో తీరని విషాదాన్ని మిగిల్చిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

నీటిలో గుంతలే ప్రమాదానికి కారణమా?

డ్యాం బ్యాక్ వాటర్ వద్ద పిల్లలు సెల్ఫీ దిగుతుండగా జరిగిన ప్రమాదానికి నీళ్ళలో గుంతలే కారణమని భావిస్తున్నారు. డ్యామ్‌లో అక్రమంగా మట్టి తరలించడంతో చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. అవి గమనించక పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు మాసాల క్రితం ఏప్రిల్ 24న గుండ్లపల్లిలో ఓ ప్రైవేట్ విద్యా సంస్థ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి ఇద్దరు కొడుకులతో కలిసి డ్యామ్ లో ఈతకు వెళ్ళగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ బాబు నీళ్ళలో మునగగా బయటకు తీసే క్రమంలో బాబుతో పాటు తండ్రీ నీళ్ళలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరిచిపోక ముందే తాజాగా ఎస్సారెస్పీలో పనిచేసే ఉద్యోగి పిల్లలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తుంది.

ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శ

మృతుడు విజయ్ అసిఫాబాద్ లో ఎస్సారెస్పీ పే అండ్ అకౌంట్ లో సూపరింటెండెంట్ గా పని చేస్తారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. విజయ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్యాం పై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు తెలుపగా ఇకనుంచి ఇరిగేషన్ అధికారులతో పాటు పోలీసులు డ్యామ్ పై నిఘా పెట్టాలని సూచించారు.

- HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి