పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కొడుకు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడి పుంజుల తండాలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోడి పుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (25) కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన జాహ్నవితో వివాహం నిశ్చయమైంది. ఆ తరువాత కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఈ నెల 18న ఆదివారం పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. ఏపీలోని విజయవాడ శివార్లలో ఉండే కంకిపాడులో ఇస్లావత్ నరశ్, జాహ్నవిల వివాహ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
మే 18న రాత్రి సమయంలో ఇస్లావత్ నరేశ్, జాహ్నవిల వివాహం జరగగా.. మంగళవారం కోడిపుంజుల తండాలో రిసెప్షన్ నిర్వహించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఉదయం ఇంట్లో అవసరాలకు నీళ్లు లేక పోవడంతో నరేశ్ బోర్ మోటార్ ఆన్ చేసే ప్రయత్నం చేశాడు.
స్విచ్ ఆన్ చేస్తుండగా, అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో నవ వరుడు ఇస్లావత్ నరేశ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్ప కూలాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. నరేశ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అందరూ రిసెప్షన్ కు రెడీ అవుతుండగా, అంతలోనే నవ వరుడు నరేశ్ మృతి చెందగా, విషయం తెలుసుకున్న నవ వధువు జాహ్నవి ఒక్కసారిగా కుప్పకూలింది. కళ్లు తిరిగి అక్కడే పడిపోవడంతో అక్కడున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను హుటాహుటిన మహబూబాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. బీపీతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటికి జాహ్నవి కోలుకోగా.. నరేశ్ మృతి చెందడంతో బోరున విలపించింది. కాగా జాహ్నవి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
వివాహ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వరుడు ఇస్లావత్ నరేశ్ మృతి చెందడంతో కోడి పుంజుల తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరి సమక్షంలో ఒక్కటైన జంటకు ఆ దేవుడు దూరం చేశాడంటూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. కాగా స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న బయ్యారం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తరువాత నరేశ్ డెడ్ బాడీని పోస్టు మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం