Transco Employee: కరెంట్ షాక్‌తో ట్రాన్స్ కో ఉద్యోగి మృతి, ముద్దనూరు తండాలో విషాదం-tragedy in muddanur tanda death of trans co employee due to electric shock ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Transco Employee: కరెంట్ షాక్‌తో ట్రాన్స్ కో ఉద్యోగి మృతి, ముద్దనూరు తండాలో విషాదం

Transco Employee: కరెంట్ షాక్‌తో ట్రాన్స్ కో ఉద్యోగి మృతి, ముద్దనూరు తండాలో విషాదం

HT Telugu Desk HT Telugu
Jun 26, 2024 08:41 AM IST

Transco Employee: గ్రామంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన రిపేర్లు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగి మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.

విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన ట్రాన్స్‌ కో ఉద్యోగి
విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన ట్రాన్స్‌ కో ఉద్యోగి

Transco Employee: విద్యుత్‌ షాక్‌తో ట్రాన్స్‌కో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం ముద్దునూరు తండా పంచాయతీ పరిధి మామిడిరేవు పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్ రావు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మామిడిరేవు పల్లి గ్రామానికి చెందిన గుగులోతు బాలాజీ(35) 15 సంవత్సరాల నుంచి ట్రాన్స్ కో డిపార్ట్మెంట్ లో అర్టిజన్ గ్రేడ్-I ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

yearly horoscope entry point

మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గ్రామంలో కరెంట్ లేదని స్థానికులు చెప్పడంతో అసలు ఏమైందో తెలుసుకోవడానికి గ్రామ బోడ్రాయి వద్ద ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను ఆఫ్ చేశాడు. దానికి కొద్ది దూరంలోని గుగులోతు రవి ఇంటి మీద ఉన్న ఎల్టీ వైర్ ను చెక్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అప్పటి వరకు కరెంట్ సరఫరా జరిగి ఉండటంతో రివర్స్ కరెంటు వచ్చి బాలాజీ పట్టుకున్న వైర్ కు షాక్ కొట్టింది.

దీంతో ఆయన విలవిలలాడుతూ కింద పడగా.. బాలాజీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడిని హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ బాలాజీని పర్వేక్షించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయాడని నిర్ధారించారు. మృతుడు బాలాజీకి భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్ రావు వివరించారు.

మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం డెడ్ బాడీని బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాలాజీ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

వరుస ప్రమాదాలతో కలకలం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల విద్యుత్తు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల కిందట ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని ఇందిరా నగర్ కాలనీలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇందిరా నగర్ కాలనీలో బంధువుల ఇంటికి దశ దిన కర్మ కార్యక్రమానికి ఓ ఫ్యామిలీ బైక్ వస్తుండగా దారికి అడ్డంగా ఉన్న డిష్ కేబుల్ వైర్ బైక్ తగలింది.

ఆ వైర్ ముగ్గురికి చుట్టుకుపోగా, వారు బైక్ తో సహా కిందపడిపోయారు. కాగా డిష్ కేబుల్ కు ఉన్న జీఐ వైర్ కు కరెంట్ పాస్ కావడంతో ముగ్గురికి షాక్ తగిలి విలవిలలాడారు. దీంతో గమనించిన స్థానికులు వెంటనే పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ను ఆఫ్ చేశారు. వెంటనే వారిని కారులో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అదే రోజు రాత్రి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురైంది. అంతకుముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి తడిసిన డోర్ మ్యాట్ ను ఇంటి ముందున్న వైరుపై ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగలగా, పక్కనే ఉన్న మరో మహిళ కాపాడే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురి కాగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో లింగాల వెంకన్న అనే రైతు వ్యవసాయ బావి దగ్గర విద్యుత్ వైర్ సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంతో కొన్ని, స్వయం తప్పిందాలతో కొన్ని ప్రమాదాలు జరుగుతుండగా, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇకనైనా ఎలక్ట్రిసిటీ అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner