Bollaram tragedy: బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రిలో విషాదం, దంపతులపై కూలిన చెట్టు, భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
Bollaram tragedy: బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన దంపతులపై చెట్టు కూలిపడటంతో భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

Bollaram tragedy: మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో తెలీదు, ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతుల్ని విధి వెక్కిరించింది. ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్టు కూలి పోయింది. చెట్టు కింద బైక్ మీద ప్రయాణిస్తున్న దంపతులపై చెట్టు కొమ్మలు కూలడంతో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి.
సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య సరళ దేవికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి కి తరలించారు. సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చెట్టు కూలడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు దాని కింద చిక్కుకుపోయారు.
తీవ్రంగా గాయపడిన వారిని కాపాడేందుకు కంటోన్మెంట్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చర్యలు చేపట్టారు. చెట్టు కొమ్మల్ని తొలగించేలోపు రవీందర్ ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కూలిన కాసేపటి వరకు రవీందర్ ప్రాణాలతో ఉన్నట్టు స్థానికులు చెప్పారు. అతడిని కాపాడేందుకు అక్కడ ఉన్న వారు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు చెట్టు కొమ్మల కింద చిక్కుకుపోయారు.
రవీందర్‌పై భారీ కొమ్మ ఒరిగిపోవడంతో తీవ్రంగా ఆందోళనతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికుల్ని విషాదానికి గురి చేసింది. అతని భార్య కూడా తీవ్రంగా గాయపడటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కంటోన్మెంట్ ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు.