Hyderabad : లారీ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించి, బూతులు తిట్టి..! ట్రాఫిక్ ఎస్ఐపై బదిలీ వేటు
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం చూపించారు. గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్ళే దారిలో ఓ లారీ డ్రైవర్ ను ఓ ఎస్సై కొట్టడమే కాకుండా బండ బూతులు తిట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర ఓ లారీ డ్రైవర్ పై ట్రాఫిక్ పోలీస్ తీవ్రంగా దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా లారీ డ్రైవర్ పై అనవసరంగా చేయి కూడా చేసుకున్నాడు. ఇదంతా పక్కనే ఉన్న అజ్ఞాత వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో తీవ్ర వైరల్ గా మారింది.
ఈ వీడియోలో లారీ డ్రైవర్ పై ట్రాఫిక్ పోలీసు బూతులు తిట్టాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ట్రాఫిక్ ఉన్నతాధికారులపై అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇదేనా ఫ్రెండ్లీ పొలిసింగ్ తీరు? హైదరాబాద్ నగరానికి బ్యాడ్ రిమార్క్ వచ్చేలా పోలీసుల తీరు ఉంది. పౌరుల పన్నులతోనే పోలీస్ అధికారులకు జీతాలు ఇస్తున్న సంగతి మరవద్దు. కేవలం ఈ ఒక్క ఘటన గురించి నేను మాట్లాడడం లేదు. ఇలాంటివి ఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా పోలీసులకు ప్రజలతో ఎలా మెలగాలో అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను" అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇదిలా ఉంటే కేటీఆర్ చేసిన ఫిర్యాదు పై తెలంగాణ పోలీసులు స్పందించారు. లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేసినట్టు ప్రకటించారు.
సిబ్బందిని సన్మానించిన రాచకొండ పోలీస్ కమిషనర్
విధి నిర్వహణలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బందిని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘనంగా సన్మానించారు. ఈనెల 15వ తేదీన మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ RCI రోడ్డు వద్ద అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
వెంకటేష్ అనే వ్యక్తి తన కారులో మహబూబ్ నగర్ వెళుతుండగా కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అది గమనించిన అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వనస్థలిపురం ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు,కృష్ణ, సాయిరాం లు స్పందించారు. కారు నడుపుతున్న వ్యక్తిని బయటికి లాగి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. అటుగా వెళ్లే వాహనాలను అప్రమత్తం చేశారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఓ వాటర్ ట్యాంకర్ సహాయంతో కారులో ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని రాచకొండ పోలీస్ కమిషనర్ అభినందించారు. అనంతరం వారందరిని సత్కరించారు.
లంచం డిమాండ్ చేసిన ఎస్సై సస్పెండ్
జగిత్యాల లో ఇసుక ట్రాక్టర్లను విడిపెంచేందుకు లంచం డిమాండ్ చేసిన రాయకల్ ఎస్సై అజయ్ సస్పెన్షన్ కు గురయ్యాడు. గత నెల 21న మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు ఎస్సై అజయ్ ను రెడ్ హాండెడ్ గా పెట్టుకున్నారు. అయితే ఎస్సై అజయ్ పోలీస్ స్టేషన్ గోడి దూకి పరారయ్యాడు. ప్రస్తుతం కూడా పరారీలోనే ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనను సస్పెండ్ చేస్తూ మల్టి జోన్ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.
రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా