hyderabad rains: హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లు.. గంటపాటు కుండపోత వాన
hyderabad rains: రాష్ట్ర రాజధాని హైదారాబాద్ తడిసి ముద్దయ్యింది. భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షపు నీరు రోడ్ల పైకి చేరడంతో.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల అధికారులు రోడ్లను బ్లాక్ చేశారు.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠిలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా మాసబ్‌ట్యాంక్, ప్యారడైజ్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రసూల్‌పురా, బేగంపేట, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ చెక్‌పోస్ట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
భారీ వర్షం కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయం టాప్ రూఫ్ నుంచి వర్షపు నీరు వచ్చింది. ఇటు షేక్‌పేట ఏరియాలో నాలా నుంచి వరద నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో ఆ రూట్లో అధికారులు రాకపోకలను నిలిపేశారు. నాలా పొంగిపోర్లడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ ఇలానే జరుగుతోందని.. జీహెచ్ఎంసీ అధికారులు ఇంకా ఎప్పుడు బాగు చేస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలించింది. రోడ్లపై భారీ గుంతలు ఉన్నాయని.. ఈ వర్షపు నీటితో అవి ఏర్పడటం లేదని వాహనదారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. టోలిచౌక్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
బస్సు దిగి ఈత కొట్టుకుంటూ..
నిజామాబాద్‌లో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారికి సాయం చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు దిగి ఈత కోట్టుకుంటూ ఎత్తులో ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిజామాబాద్ వాసులు చెబుతున్నారు.