HYD Traffic Diversion: హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు
HYD Traffic Diversion: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
HYD Traffic Diversion: ఎల్‌బి స్టేడియంలో రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై ఉండే ప్రముఖుల వివరాల ఆధారంగా బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచే బందోబస్తు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. భద్రతా విధుల కోసం దాదాపు 2 వేల మందిని వినియోగిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు.
గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల ఎల్‌బి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 90102 03626లో సంప్రదించాలని సూచించారు. వీఐపీలు, ఆహుతులతో పాటు సాధారణ ప్రజల కోసం ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
వాహనాల మళ్లింపు ఇలా….
నిర్ణీత సమయాల్లో సాధారణ వాహన చోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్-బీజేఆర్ విగ్రహం-బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు.
చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు.
గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు.
నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు.
బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తించనున్నాయి.