Traffic Diversions : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారి 65పై వాహనాలను మళ్లిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జాతర జరిగే ప్రదేశం సూర్యాపేట పట్టణానికి 3 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి ఎన్.హెచ్ 65 పై ఉంటుంది కావున వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆంక్షలు విధించనున్నారు.
పెద్దగట్టు తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. దీన్నే 'గొల్లగట్టు' జాతర అని కూడా అంటారు. ఈ అతిపెద్ద జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతులస్వామి ఇక్కడ పూజలందుకుంటారు. ఈ నెల 16వ తేదీ నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీతో ముగియనుంది. పెద్దగట్టు జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేలా కార్యాచరణను సిద్ధం చేసింది.
సంబంధిత కథనం