Teenmaar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుల గణనపై చేసిన కామెంట్స్ పై వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందుకోసం వారం గడువును విధించింది. వివరణ లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన విషయంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన వివరాలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కుల గణనపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులకు స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
కాంగ్రెస్ లో మల్లన్న మంటలు…!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కుల గణనను చేపట్టింది. ఇందుకు సంబంధించి వివరాలను ఇటీవలే విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే ఈ నివేదికలో పేర్కొన్న వివరాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీసీలను మోసం చేసేలా కుల గణన లెక్కలు ఉన్నాయని ఆరోపించారు. కుల గణన పూర్తిగా బోగస్ అని విమర్శించారు. ఇది జానారెడ్డి సర్వే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వేనే 100 శాతం కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. బీసీ కులగణన రిపోర్టును తగలబెట్టాలని పిలుపునిచ్చారు.
శాసనమండలిలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న లెక్కలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి భిన్నంగా కుల గణన సర్వే తీరు ఉందని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా…. మండలి నుంచి బయిటికి వచ్చిన తర్వాత కుల గణన నివేదికను తగలబెట్టారు.
ఇక ఇటీవలే వరంగల్ వేదికగా బీసీల సభను నిర్వహించారు. ఇందులో మాట్లాడిన తీన్మార్ మల్లన్న ఓ కులాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సదరు సమాజికవర్గానికి చెందిన పలువురు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఫిర్యాదులు కూడా చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న మాటలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. అయితే పార్టీ ఇచ్చిన నోటీసులకు మల్లన్న స్పందిస్తారా..? ఎలాంటి వివరణ ఇస్తారు..? ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అనేది కూడా చూడాలి..!
సంబంధిత కథనం