Revanth reddy: బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్.. నెల్లూరులో పోటీ చేస్తారా..?
ఈడీ నోటీసులతో గాంధీ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్.. దమ్ముంటే ఏపీలో జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బందిపెడుతున్న బీజేపీ ప్రభుత్వ చర్యలపై ప్రతి కార్యకర్త స్పందించాలని కోరారు. ఈడీ నోటీసులపై శాంతియుతంగా నిరసన తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన... గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని.. ఇలాంటి చర్యలను సహించేదిలేదని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగనప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ కు వీఆర్ఎస్...
కేసీఆర్ కొత్త పార్టీ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కొత్త పార్టీపై ఆలోచిస్తున్న కేసీఆర్.. దమ్ముంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తారా..? అని సవాల్ విసిరారు. కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదని సెటైర్లు విసిరారు. ఆయనకు ఫౌంహౌజే రాష్ట్రం, దేశమంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారని దుయ్యబట్టారు. కొంత కాలానికి ప్రజలే టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారని వ్యాఖ్యానించారు.
దేశంలో కాంగ్రెస్ లేదంటున్న కేసీఆర్... తమ పార్టీతో చేతులు కలిపేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు.టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా పోటీ చేయాల్సింది తెలంగాణలోనే కదా అని అన్నారు. కేసీఆర్ ప్రకటనలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు.
‘ఎంపీగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ ఫౌంహౌస్ లోనే ఉన్నారు. ఆయన ఉద్దేశ్యంలో అన్ని ఫౌంహౌసే. ఆ ప్రపంచానికి రారాజు ఆయనే. బీఆర్ఎస్ పెట్టుకున్నా... ఇక్కడే కదా పోటీ చేస్తారు కదా..? కాంగ్రెస్ లేదన్నప్పుడు మాతో పొత్తు పెట్టుకునేందుకు ఎందుకు ప్రాదేయపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీపై దేశమంతా పోటీ చేయవచ్చు కదా...? నిషేధం ఏం లేదు కదా..? ఈ దుకాణం బంద్ అయిందని.. కొత్త దుకాణం తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారా..? కేసీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాలక్షేపం చేసేందుకు ఇలాంటి కథలు చెబుతుంటారు. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో జోకర్ గా చూస్తున్నారు. ఇదే విషయాన్ని వారు నాతో చెప్పారు' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు