Hyd ORR Lease : లిక్కర్ స్కాం కంటే ORR టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దది - రేవంత్ రెడ్డి-tpcc chief revanth reddy serious comments on orr lease ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tpcc Chief Revanth Reddy Serious Comments On Orr Lease

Hyd ORR Lease : లిక్కర్ స్కాం కంటే ORR టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దది - రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 26, 2023 06:52 PM IST

Revanth Reddy Latest News:లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy On ORR Lease: ఓఆర్ఆర్ టోల్ వ్యవహరంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని ఆరోపించారు.“రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు తెగనమ్మారు. ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైంది. ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహరంలో కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీ పాల్పడింది. ఇందులో కేసీఆర్, కేటీఆర్ లబ్దిదారులైతే.. సూత్రాధారులు, పాత్రధారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. "గతంలో ఇదే అంశంపై..టెండర్ దక్కిన సంస్థకు అనుకూలంగా నిబంధనలు మార్చడం, బేస్ ప్రైస్ లేకుండా టెండర్లను పిలవడం, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్లకు లీజుకు ఇస్తే సమస్యలు వస్తాయి.. కాబట్టి అంత సుదీర్ఘ కాలం కాకుండా టెండర్ వ్యవధి ఉండాలని, అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెండర్ అయిన 15 - 20 ఏళ్లకు మించి ఇవ్వలేదు అని ఎన్ హెచ్ఏఐ సూచించిన పట్టించుకోకుండా టెండర్ ప్రక్రియను చేపట్టిన విధానాన్ని ప్రస్తావించాను. నాకున్న సమాచారం మేరకు టెండర్ దక్కించుకున్న సంస్థ టెండర్ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లోగా, మిగతా 90 శాతాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి నిబంధనలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న మీడియా సమావేశంలో బుకాయించారు" అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

“అగ్రిమెంట్ లోని 20, 21 పేజీలో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేను చెప్పింది 10 శాతమే.. కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలి. మిగతా 75 శాతాన్ని 120 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. ఆ మార్చిన నిబంధనలు ఏమిటో బయటపెట్టాలి. ఈ రోజు నేను బయట పెట్టిన కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించి ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ రోజుతో 30 రోజుల గడువు ముగిసింది. అయితే రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి IRB సంస్థ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ఐఆర్బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. ఒక వేళ చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు IRB సంస్థ టెండర్ ను రద్దు చేయాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలి..ఆయన విదేశీ పర్యటనలో బీజీగా ఉంటే అరవింద్ కుమార్ స్పందించాలి. దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్ పై ఉంది. ఇందుతో ఏమీ తేడా జరిగిన అరవింద్ కుమార్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. “తెలంగాణలో బీజేపీది మూడో స్థానమే అని వాళ్ల జాతీయ నాయకులే చెబుతున్నారు. గట్టి నాయకులు 40 మంది లేకుండా ఎలా గెలుస్తామని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ను గెలవకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని...ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టంగా చెప్పారు. మేం ముందు నుంచి చెబుతున్నట్లు బీజేపీ, బీఆరెస్ ఒక్కటే...కేసీఆర్, మోదీ అవిభక్త కవలలు. కర్ణాటకలో ఇదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ నాటకామామడి జేడీఎస్ గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలని చూశారు. కానీ అక్కడి ప్రజలు తిరస్కరించారు. అక్కడ బీజేపీ పోషించిన పాత్రను ఇక్కడ బీఆర్ఎస్, జేడీఎస్ పాత్రను బీజేపీ పోషిస్తుంది. ఇప్పటికైనా ప్రజులు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఓడించేది కాంగ్రెస్ పార్టీ మాత్రేమే” అని రేవంత్ రెడ్డి అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం