ాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు. సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. కిందటి ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అనుమానం రావడంతోనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. సిట్ విచారణ అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ మీద మహేశ్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమైన చర్య అని చెప్పారు. దీనికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగ్ కారణమని తెలుస్తోందన్నారు. రేవంత్ రెడ్డితోపాటుగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఈ విషయంపైనే ఫిర్యాదు చేసినట్టుగా మహేశ్ గౌడ్ గుర్తు చేశారు. 2022 నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు చేశారు. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నేతల పేర్లు జాపితో ఉన్నాయని తెలిపిందన్నారు.
బీఆర్ఎస్ అధికారాన్ని ఏ తీరుగా దుర్వినియోగం చేసిందో అర్థం చేసుకోవచ్చని మహేశ్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో సరిగా పని చేయాల్సిన అధికారులు.. రాజకీయ నేతలకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తారని విమర్శించారు ప్రైవసీ అనేది తమ ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాశారని మండిపడ్డారు. పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
'మా ఫోన్లను ట్యాప్ చేశారు. దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. ఇందుకు మీరు శిక్షార్హులు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకూడదంటే వీరికి శిక్ష పడాలి. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్ష పడాల్సిందే. విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరుతున్నాం.' అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.