CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ, చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ
Tollywood Stars Meets CM Revanth Reddy : టాలీవుడ్ సినీ ప్రముఖులు రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది.
Tollywood Stars Meets CM Revanth Reddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు...అనంతర పరిణామాల మధ్య టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. గురువారం ఉదయం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఇతర నిర్మాతలు, దర్శకులు... సీఎంను కలవనున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ఇకపై అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల ఉండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై ఈ భేటీలో చర్చ జరగనుంది. పన్నుల విధానం, ఫిల్మ్ ఛాంబర్ ఫీల్, సినీ పరిశ్రమకు ఇన్‌సెంటివ్స్, సౌకర్యాల అభివృద్ధి, అలాగే ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఈ సమావేశం టాలీవుడ్ అభివృద్ధికి దోహదం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ భేటీ సినీ పరిశ్రమకు కావాల్సిన ప్రాధాన్యతను కేటాయించడమే కాక, సమస్యల పరిష్కారాలపై పునరాలోచన చేసే అవకాశం కల్పించనుందని పలువురు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ వివాదం అనంతరం మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. అయితే సినీ పరిశ్రమపై తమకు ఎలాంటి కక్షలేదని, బాధితుల పక్షాన మాట్లాడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎంతో సమావేశం ఖరారు
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ రూ.2 కోట్ల పరిహారం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. రూ.2 కోట్ల చెక్కును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు అందించినట్లు అల్లు అరవింద్ తెలిపారు.
శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెగురుపడిందని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారన్నారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగామని, సినీ ప్రముఖులు సీఎంను కలిసి చర్చిస్తామన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెళ్లి సీఎంను కలుస్తామన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవుతామన్నారు.
సంబంధిత కథనం