Producer KP Chowdary : గోవాలో కబాలి నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
Producer KP Chowdary : కబాలి తెలుగు వర్షన్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక కారణాలు, డ్రగ్స్ కేసు ఆయన సూసైడ్ కు కారణాలుగా తెలుస్తున్నాయి.
Producer KP Chowdary : సినీ నిర్మాత, డ్రగ్స్ కేసులో పట్టుబడిన కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక ఇబ్బందులు సూసైడ్ కు కారణాలు కావొచ్చని ఆయన సంబంధీకులు అంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీరంగంలోకి వచ్చారు. కేపీ చౌదరి కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.

కృష్ణప్రసాద్ చౌదరి 2016లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.
గోవాలో పబ్
నిర్మాతగా సక్సెస్ కాకపోవడంతో కేపీ చౌదరి గోవాలో ఓమ్ పబ్‌ను స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారంలో కూడా లాస్ రావడంతో డ్రగ్స్ దందాలోకి దిగారు. తన పరిచయాలతో సెలబ్రెటీలకు డ్రగ్స్ విక్రయాలు మొదలుపెట్టారని వార్తలు వచ్చాయి. 2023లో హైదరాబాద్ వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదలైన ఆయన గోవాలో ఉంటున్నట్లు తెలుస్తోంది.
వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరిని గతంలో రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి కొకైన్ తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకురాగా 90 ప్యాకెట్లను కేపీ చౌదరి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై అప్పట్లో పోలీసుల దర్యాప్తు చేశారు.
సినీతారలతో దగ్గరి సంబంధాలు
అప్పట్లో పలువురి సినీ తారలతో దగ్గర సంబంధాలున్నాయని కేపీ చౌదరి పేరు వినిపించింది. సెలబ్రెటీలతో హగ్గులు, ముద్దులు, పలువురు లేడీ యాక్టర్స్ తో కేపీ చౌదరి చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. డ్రగ్స్ కేసు బయటకు రావడంతో...కేపీ చౌదరి పబ్ ఓనర్గా మాత్రమే తమకు తెలుసని, డ్రగ్స్ తో తమకు సంబంధం లేదని పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు చెప్పుకొచ్చారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కేపీ చౌదరి సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేపీ చౌదరి ఆత్మహత్య విషయాన్ని గోవా పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.