TS TET Exam 2023 : ఇవాళే 'టెట్' ఎగ్జామ్ - అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే
Telangana TET Exam 2023: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.
Telangana TET Exam 2023: శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్ష జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. టెట్‌కు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారికోసం 1,139 పరీక్షా కేంద్రాలు, పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారి కోసం 913 పరీక్షా కేంద్రాలున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,052 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల ఏర్పాటు, అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు తీసుకున్నారని వివరించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుందని వివరించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి పరిశీలకులను నియమించామని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
టెట్ అభ్యర్థులకు సూచనలు:
- టెట్ రాసే అభ్యర్థులు పేరులో అక్షర దోషాలు చూసుకోవాలి.
- ఒక వేళ ఏమైనా తప్పులు ఉంటే.. పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకునే అవకాశం ఉంటుంది.
- హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. లేకపోతే అభ్యర్థుల తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. గెజిటెడ్ అటెస్టేషన్ ఉంటేనే పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు.
- గంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- టెట్ లో ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమలు చేయనున్నారు.
- పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను..అభ్యర్థులనుఅనుమతించరు.
- రెండు సేషన్ల పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు.
-ఒక వేళ అభ్యర్థులు ఎవరైనా ముందుగానే బయటకు వస్తే.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు.
-ఎలక్ట్రానిక్ పరికరాలు..రిమోట్ తో కూడిన కారు తాళాలు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు.
- ఓఎంఆర్ షీట్లో బ్లూ..బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుంది.
- హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదు.
- పరీక్ష రాసే ముందు OMR ఆన్సర్ షీట్ సైడ్‌లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి అనుసరించాలి.
- మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం మీరు ఎంచుకున్న భాషలో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ చెప్పాలి.
టెట్ పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు, కాలేజీలకు గురు, శుక్రవారం రెండురోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.