HYD Schools Holiday: హైదరాబాద్‌లో పాఠశాలలకు నేడు సెలవు
HYD Schools Holiday: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
HYD Schools Holiday: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులకు డిఈఓలకు ఆదేశించారు.
మరోవైపు భారీ వర్షంతో నగరం తడిచి ముద్దైంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి మోస్తరుగా.. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి నగరమంతటా వర్షం కురుస్తూనే ఉంది.
నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, బేగంపేట, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, నాంపల్లి, అంబర్‌పేట్, మలక్‌పేట్, సైదాబాద్, పాతబస్తీ, సాగర్‌రింగ్ రోడ్, హస్తినాపురం, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. రోడ్లపై మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.