Telangana Govt : ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం - అజెండాలోని అంశాలివే..!
CM Revanth Reddy Meeting With Collectors : ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి... అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు.. 'ప్రజాపాలన' కార్యక్రమంపై ప్రధానంగా చర్చించనున్నారు. పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
CM Revanth Reddy News: రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సమావేశం కానున్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ లోపాలను ఆరికట్టడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజా పాలన' కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు. దీనితోపాటు, ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.
నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారిగా ఉండేందుకై ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు ఈ ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి.
ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్/ కార్పొరేటర్/ కౌన్సిలర్ లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారని సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
సంబంధిత కథనం