ED questioning Kavitha: ఇవాళ ఈడీ ముందుకు కవిత... కీలక పరిణామాలు ఉంటాయా..?-today brs mlc kavitha appear for ed questioning over delhi liquor case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Today Brs Mlc Kavitha Appear For Ed Questioning Over Delhi Liquor Case

ED questioning Kavitha: ఇవాళ ఈడీ ముందుకు కవిత... కీలక పరిణామాలు ఉంటాయా..?

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 07:05 AM IST

delhi liquor case updates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందుకు రానున్నారు. లిక్కర్ కేసులో నోటీసులు అందుకున్న ఆమె… విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha appear for ED questioning: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఢిల్లీలో దీక్ష కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పిన కవిత... ఇవాళ (మార్చి 11) విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో విచారించనున్నారు. రామచంద్ర పిళ్లై వాంగ్మూలం, సౌత్‌ గ్రూపు లావాదేవీలు, ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపై లోతుగా విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్నారు కవిత. అయితే ఈసారి ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ కేసులో అరెస్ట్ అయి నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై విచారణలో స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇవాళ జరిగే విచారణలో పలు అంశాలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని సమాచారం. అయితే కవితను ఎంతసేపు విచారిస్తారు..? విచారణ సందర్భంగా అరెస్ట్ చేస్తారా..? లేక గతంలో మాదిరిగానే విచారించి పంపిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరో మలుపు...

అయితే ఈ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో స్టేట్ మెంట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై... తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.... ఈడీకీ నోటీసులు కూడా జారీ చేసింది. మొదటగా స్టేట్ మెంట్ ఇచ్చిన పిళ్లై... ఇలా పిటిషన్ దాఖలు చేయటంతో ఏం జరగబోతుందనేది కీలకంగా మారింది. కాగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారుల కీలక విషయాలు పొందుపర్చారు. సిసోడియా రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును అధికారులు ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కుట్రలో కవిత భాగస్వామిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలతో కవితకు రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పినట్లు ఈడీ వివరించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తే.. ఆప్ కు నిధులు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని.. 2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్ నాయర్ ను కవిత కలిశారని పేర్కొంది. 2021 జూన్ లో హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లోను భేటీ జరిగిందని వివరించింది. ఇండో స్పిరిట్ లో కవితకు 32.5 శాతం వాటా ఉందని వెల్లడించింది. అందరికీ కలిపి మొత్తం రూ. 292 కోట్లు ముట్టినట్లు స్పష్టమైందని వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ లాభం ద్వారా రూ. 192 కోట్లు దక్కించుకుందని ఈడీ వివరించింది.

ఇక బీఆర్ఎస్ విస్తృత స్థాయిలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతల వరకు వచ్చిన ఈడీ... ఇప్పుడు కవిత వరకు వచ్చారని వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం కవితను అరెస్టు చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్... ఒకవేళ అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. విపక్ష నేతలందరినీ ఇలాగే వేధిస్తున్నారని.. బీజేపీ చర్యలకు భయపడేది లేదని.. పోరాటం కూడా ఆపే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామంటూ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలపై దాడులు జరిగినట్టు గుర్తు చేసిన ఆయన... ఎన్నికలు దగ్గరికొస్తున్నాకొద్దీ ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశముందని అన్నారు.

మొత్తంగా మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరవుతున్న నేపథ్యంలో... ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం