Phone Tapping Case : ప్రతిపక్ష పార్టీల నగదే టార్గెట్...! తిరుపతన్న వాంగ్మూలంలో కీలక విషయాలు-tirupathanna confession statement in the phone tapping case has mentioned key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping Case : ప్రతిపక్ష పార్టీల నగదే టార్గెట్...! తిరుపతన్న వాంగ్మూలంలో కీలక విషయాలు

Phone Tapping Case : ప్రతిపక్ష పార్టీల నగదే టార్గెట్...! తిరుపతన్న వాంగ్మూలంలో కీలక విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 29, 2024 12:15 PM IST

Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు వాంగ్మూలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలను ప్రస్తావించినట్లు సమాచారం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్ది సంచలనాలు...!
ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్ది సంచలనాలు...!

Phone Tapping Case Updates: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కీలక అంశాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఈ కేసు విచారణకు ఏర్పాటైన ‘సిట్’(ప్రత్యేక విచారణ బృందం) పట్టుబిగిస్తూ… ముందుకెళ్తోంది. కేసుతో సంబంధమున్న ఏ ఒక్క అధికారిని వదలకుండా ఉచ్చుబిగించే పనిలో పడింది. ఈ క్రమంలోనే పలువురు అధికారులను కూడా అరెస్ట్ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన అధికారులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే వీరిని కస్టడీలోకి తీసుకుంటున్న సిట్…. వారి నుంచి కీలక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో…. అరెస్ట్ అయిన అధికారులు ఒక్కొక్కరిగా నోరు విప్పుతున్నారు.

ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పాటు ఇంటెలిజెన్స్ మాజీ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలాలను ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావటంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలపై నిఘా పెట్టినట్లు రాధా కిషన్ రావు చెప్పారు. జర్నలిస్టులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారని తెలిసింది. ఇదే సమయంలో… ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారానికి సంబంధించి కూడా కీలక సమాచారం అందజేశారు.

తిరుపతన్న వాంగ్మూలంలో కీలక విషయాలు…!

ఈ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోవటమే లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారని సమాచారం.

ఈ వ్యవహారమంతా ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు డైరెక్షన్ లోనే నడిచినట్లు తిరుపతన్న తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు. ప్రభాకర్ రావుతో పరిచయం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసినంత వరకు ఏం జరిగిందనే విషయాలను సిట్ కు వెల్లడించారు. మునుగోడు బైపోల్ సందర్భంగా ఫోన్ కాల్స్ ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో నడిచినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మీటింగ్స్ లో తాను కూడా పాల్గొన్నట్లు వివరించారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి విధులు నిర్వర్తించారనే దానిపై కూడా సిట్ ఆరా తీసింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకోవటమే లక్ష్యంగా పని చేసినట్లు తిరుపతన్న చెప్పినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్‌రావుతో కలిసి పని చేశానని తెలిపారు. ఈ టీమ్ లో కొందరు సీఐలతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ టీమ్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశాలను చూసేదని తిరుపతన్న తన వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు సమాచారం. 40 మందికిపైగా నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసే బాధ్యతను చూసేవాళ్లమని…. వచ్చిన సమాచారం ప్రకారం డబ్బు రవాణాను అడ్డుకునే వాళ్లమని వివరించారు. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బులను అడ్డుకోవటంలో విజయవంతంగా పని చేశామని తెలిపినట్లు తెలిసింది.

ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్…!

ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు చెందిన సమాచారం సేకరించిన డబ్బులను అడ్డుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురి పేర్లను తిరుపతన్న చెప్పినట్లు తెలిసింది.

తాము ఇచ్చే సమాచారం మేరకు స్థానిక పోలీసులు తనిఖీలు చేసి డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతన్న వెల్లడించారు. బీఆర్ఎస్ ను మూడోసారి గెలిపించటమే లక్ష్యంగా పావులు కదిపినట్లు చెప్పారు. ఇక తన వాంగ్మూలంలో కంప్యూటర్ హార్డ్ డిస్కుల ధ్వంసంతో పాటు పలు విషయాల గురుంచి సమాచారం ఇచ్చారు.

ఈ కేసు విచారణకు సంబంధించి త్వరలోనే ఉన్నతాధికారులు అధికారికంగా వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలను కూడా విచారించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో…. ఈ కేసులో ఎప్పుడు ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం