TG MLC Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి.. ఉద్యమానికి ఊపిరి!
TG MLC Elections : ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎస్ యూనియన్ నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డిని యూనియన్ నేతలు ఖరారు చేశారు.
ఉమ్మడి కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గం, 13 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
ఇటీవలే వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట కొలిపాక వెంకటస్వామిని యూనియన్ ప్రకటించింది. ఈ కార్యవర్గ సమావేశంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకి గత 28 సంవత్సరాలుగా సేవలు అందించిన సీనియర్ టీచర్ తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డిని సీపీఎస్ యూనియన్ బలపరిచే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపుతున్నట్లు కార్యవర్గ సమావేశం తీర్మానించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. రాబోయే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు సీపీఎస్ అధ్యాపకుడిన్ని, మరోవైపు పాత పెన్షన్‌లో ఉన్న ఉపాధ్యాయున్ని అభ్యర్థులుగా పోటీలో నిలిపామని చెప్పారు. సీపీఎస్, ఓపీఎస్ అనే తేడా లేకుండా.. ఉపాధ్యాయ వర్గం వీరి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సీపీఎస్ విధానంపై రెఫరెండంగా బరిలో ఉంటున్నామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు గొప్ప అవకాశం వచ్చిందని యూనియన్ నేతలు వివరించారు. ఈ ఓటు హక్కుతో సీపీఎస్ సంఘ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మార్చి 29 వరకు..
ఈ నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పించింది. 2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరించనున్నారు.