Medaram Jatara: వన దేవతల పున: దర్శనానికి వేళాయే! గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతరకు శ్రీకారం-time for the forest gods to return the mini medaram fair begins with the gudi melige festival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara: వన దేవతల పున: దర్శనానికి వేళాయే! గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతరకు శ్రీకారం

Medaram Jatara: వన దేవతల పున: దర్శనానికి వేళాయే! గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతరకు శ్రీకారం

HT Telugu Desk HT Telugu
Published Feb 06, 2025 08:21 AM IST

Medaram Jatara: వన దేవతలు సమ్మక్క, సారలమ్మ పున: దర్శనానికి వేళైంది. అసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుండగా.. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర కూడా జరుగుతుంది.

మినీ మేడారం జాతరకు సిద్ధం
మినీ మేడారం జాతరకు సిద్ధం

Medaram Jatara: ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుండగా.. బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగె, మండ మెలిగె పండుగ నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు గుడి మెలిగె పండుగకు శ్రీకారం చుట్టారు.

గుడిమెలిగెతో ఆలయాల శుద్ధి

మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్దబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడిమెలిగె పండుగ నిర్వహించారు. ఈ గుడిమెలిగే పండుగలో భాగంగా అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని నీటితో శుద్ధి చేశారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు డోలు వాయిద్యాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకొని వచ్చారు.

గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. ఈ మండమెలిగె, గుడిమెలిగె పండుగతో వన దేవతల మినీ జాతర ప్రారంభమైనట్టేనని పూజారులు చెబుతున్నారు. ఇప్పటినుంచి మినీ జాతర ముగిసే వరకు ప్రతి రోజు ఇక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రాత్రి వేళల్లో డోలీలతో కొలుపు కూడా నిర్వహిస్తారు.

కొండాయిలో కూడా గోవిందరాజులు, నాగులమ్మ జాతరను పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండుగ నిర్వహించారు. ఏటా కొండాయి, దొడ్ల గ్రామాల్లో జాతర నిర్వహించనుండగా, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజుల గుళ్లను అందులోని పూజా సామగ్రి ఆడేరాలు, పడిగలు, బూరలు ఇతర సామగ్రిని శుద్ధి చేసి అలంకరించారు. ఆలయ ఆవరణను ముగ్గులతో ప్రవేశ మార్గాల్లో మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేశారు.

రూ.32 కోట్లతో ఏర్పాట్లు

మేడారం మినీ జాతరకు ప్రభుత్వం రూ.32 కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర జరగనుండగా, నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో రూ.32 కోట్లతో పనులు చేపట్టింది.

ఇందులో రూ.1.80 కోట్లతో మేడారం, కన్నెపల్లిలో శ్రీ సమ్మక్క, సారలమ్మల ఆలయాలు నిర్మించారు. రూ.1.50 కోట్లతో పూజారుల గెస్ట్‌హౌజ్‌, రూ.2.20 కోట్లతో వీవీఐపీ గెస్ట్‌హౌజ్‌, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.22 కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు. మేడారం, కన్నెపల్లి, కాల్వపల్లి, ఊరట్టం గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టారు.

మేడారం గద్దెల వద్దకు వచ్చే క్యూలైన్లపై పర్మినెంట్‌గా చలువ పందిళ్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లు కేటాయించారు. ఇలా వివిధ పనుల కోసం ప్రభుత్వం రూ.32 కోట్లు కేటాయించగా.. వాటితో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner